రాజకీయ నాయకులది, అధికారులదే: రూ.13వేల కోట్ల ఆస్తిపై మహేష్ షా షాక్
తన వద్ద రూ.13 వేల కోట్ల ధనం ఉందని ప్రకటించిన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షాను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారు.
అహ్మదాబాద్: తన వద్ద రూ.13 వేల కోట్ల ధనం ఉందని ప్రకటించిన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షాను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారు. శనివారం నాడు ఆయనను ప్రశ్నించారు. నల్లధనం ప్రకటన, ఐటీ దాడుల తర్వాత అతను కనిపించకుండా పోయాడు.
ఆ తర్వాత తొలుత అతను టెలివిజన్ ఛానల్స్‌లో కనిపించాడు. తాను ప్రకటించిన డబ్బు తనది కాదని అతను ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అనంతరం అతనిని ఆదాయపన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారు.

ఆ డబ్బును తనకు రాజకీయ నాయకులు ఇచ్చినట్లు అతను ప్రకటించాడు. ఆ డబ్బంతా తనది కాదని, రాజకీయ నాయకులతో పాటు పలువురు అధికారుల సొత్తు అని చెప్పారు. సమాచారం మేరకు.. మహేష్ షా అహ్మదాబాదులో నాలుగు బెడ్ రూంల అపార్టుమెంటులో ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా స్థానికంగా ఉంటూ పలువురి వద్ద అప్పులు కూడా చేశాడు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. ఈ డబ్బు ఎక్కడిది, ఎవరిది అనే విషయాలు పేర్లతో సహా ఐటీ శాఖ అధికారులకు వెల్లడిస్తానని చెప్పారు. తాను పారిపోలేదని చెప్పారు. ఇందులో తన కుటుంబ సభ్యులను ఇరికించవద్దని విజ్ఞప్తి చేశారు.
తాను ప్రకటించిన డబ్బు కొందరిది అంటూ ప్రచారం జరిగిందని, అది నిజం కాదన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని నిజాలను ఐటీ అధికారులకు వెల్లడిస్తానని చెప్పారు. నాటకీయ పరిణామాల మధ్య మహేష్ షాను ఓ టీవీ స్టూడియోలోనే అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉన్నట్లు అధికారులకు వెల్లడించాడు. ఐడీఎస్ పథకం మరో ఐదు నిమిషాల్లో ముగిసిపోతుందనగా సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి 11.55 గంటలకు ఆయన ఆస్తులు ప్రకటించాడు.
పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ. 1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు. నవంబర్ 29 నుంచే షా కనిపించకుండా పోయారు. దీంతో ఆయన సీఏ సేత్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ రోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని సేత్నా చెప్పారు. దీంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆయన కోసం ఎన్నిచోట్ల గాలించినా ఫలితం లేకుండా పోయింది.
దీనిపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, అతను పారిపోలేదని, గత 15 రోజులుగా కాంటాక్టులో లేడని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం, స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం ద్వారా 13 వేల కోట్ల రూపాయల నల్లధనం వెల్లడించిన మహేశ్ షాను ఇన్‌కం టాక్స్ అధికారులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications