Gyanvapi Mosque : ఏఎస్ఐ సర్వేతో జ్ఞానవాపి మసీదు దెబ్బతింటే ? అలహాబాద్ హైకోర్టు ఆక్షేపణ..
ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన వారణాసి కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)సర్వేకు అనుమతిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు .. అలహాబాద్ హైకోర్టులో తేల్చుకోమంది. దీంతో ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణలో పలు ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
అలహాబాద్ హైకోర్టులో జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏఎస్ఐ సర్వేపై మసీదు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. మసీదు కింద 15వ శతాబ్దం నాటి గుడి ఉందనే అపోహల కారణంగా సర్వే ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది. అలాగే సర్వే కారణంగా మసీదు స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇది వెయ్యేళ్ల క్రితం నాటి మసీదు అని కమిటీ గుర్తుచేసింది. సర్వేపై తమకు నమ్మకం లేదని తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎవరిపైనా నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించింది.

అనంతరం మసీదు కమిటీ అభ్యంతరాలపై ఏఎస్ఐని ప్రశ్నించింది. మసీదు స్వరూపం దెబ్బతినకుండా సర్వే ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో గతంలోనూ ఇలాంటి సర్వేలు చేశామని జవాబిచ్చింది. తాము రాడార్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేస్తామని, చివర్లో అవసరమైతే తవ్వకాలు చేపడతామని తెలిపింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మసీదు దెబ్బతినకుండా సర్వే చేసేందుకు అవకాశం లేదా అని ప్రశ్నించింది. దీనికి ఏఎస్ఐ వద్ద సమాధానం లేదు. దీంతో సర్వేపై పూర్తి క్లారిటీతో రేపు విచారణకు రావాలని సూచించింది. అలాగే రేపటి వరకూ ఎలాంటి సర్వే చేయొద్దని ఆదేశించింది.
మరోవైపు మొగల్ చక్రవర్తి అక్బర్ మంత్రి అయిన రాజా తోడర్ మాల్ ఆదేశాల మేరకు 1585లో ఈ స్థలంలో నిర్మించిన ఆలయాన్ని 1669లో కూల్చివేశారని హిందూ పక్షం ఆరోపిస్తోంది. అలాగే హిందూ మహిళల బృందం ఇప్పుడు ఆ ప్రాంగణంలో పూజలు చేసేందుకు కోర్టును అనుమతి కోరింది. మసీదు కమిటీ మాత్రం అనుమతి ఇవ్వొద్దని కోరుతోంది. సుప్రీంకోర్టు కూడా తాజాగా సర్వే విషయం అలహాబాద్ హైకోర్టులో తేల్చుకోమంటూనే.. గతంలో శివలింగం ప్రతిమ బయటపడిందని చెబుతున్న ప్రాంతాన్ని దీన్నుంచి మినహాయించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications