‘ప్రణబ్ ప్రధాని అయ్యుంటే 2014 ఓటమి తప్పేది’
న్యూఢిల్లీ: 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం మన్మోహన్ సింగ్ బదులు ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా చేసి ఉంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటమి తప్పేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి మన్మోహన్‌ను ఎంపిక చేయడం.. ఇంటా బయటా అనేకమందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని చెప్పారు.
‘ది అదర్‌సైడ్ ఆఫ్ మౌంటెయిన్' పేరుతో రచించిన నూతన పుస్తకంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్ యావద్దేశం నుంచి ప్రశంసలు పొందారని ఖుర్షీద్ చెప్పారు.

అంతటి వ్యక్తి కూడా 1999 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలో ఎవరికీ పెద్దగా తెలియని అభ్యర్థి చేతిలో ఓడిపోయారని గుర్తు చేశారు. మన్మోహన్‌కు యూపీఏ సారథ్య బాధ్యతలు అప్పగించడంపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా, రెండోసారి కూడా యూపీఏ అధికారంలోకి వచ్చాక అది సరైన నిర్ణయమేనని రుజువయిందని చెప్పారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ప్రజాదరణ పొందిన నేతలనీ, వారికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని అందించేవారెవరూ పార్టీలో లేరని పేర్కొన్నారు. కాగా, మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్న సమయంలో విదేశీ వ్యవహారాల మంత్రికు తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు.












Click it and Unblock the Notifications