అద్భుతమే: కదులుతున్న రైలు కింద పడిన బాలుడు సురక్షితం, లోకోపైలట్లే ప్రాణదాతలు
న్యూఢిల్లీ: ఆ బాలుడి అదృష్టం బాగుంది. ఎందుకంటే, కదిలే రైలు కింద పడిన ఆ బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రైలు డ్రైవర్ వెంటనే గమనించి రైలును ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడటంతో పెను ప్రమాదం తప్పింది. అనూహ్యంగా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడటంతో ఆ రైలు డ్రైవర్, అతని సహాయకుడు ఎంతో ఆనందపడ్డారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

బాలుడ్ని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలట్..
వివరాల్లోకి వెళితే.. లోకో పైలట్ దివాన్ సింగ్, అతని సహాయకుడు అతుల్ ఆనంద్.. ఢిల్లీ-ఆగ్రా రైలు నడుస్తున్న సమయంలో రైలు కింద ఓ రెండేళ్ల బాలుడు పడినట్లు గుర్తించారు. వెంటనే వారు అత్యవసర బ్రేకులు వేశారు. ఆ తర్వాత దివాన్, అతుల్ రైలు నుంచి బయటకు దూకేశారు. రైలు కింద బాలుడు క్షేమంగా ఉండటంతో వీరు ఆనంద, ఆశ్చర్యాలకు గురయ్యారు.

బాలుడ్ని తల్లికి అప్పగించారు.. బహుమతి ప్రకటన
రెండు పట్టాల మధ్యలోనే బాలుడు ఉండటంతోనే ఇది సాధ్యమైనట్లు గుర్తించారు.
వెంటనే ఆ బాలుడ్ని బయటకు తీసి, అతని తల్లికి అప్పగించారు. ఈ ఘటన ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. కాగా, ఈ గూడ్స్ రైలు డ్రైవర్ జరిగిన ఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా పై అధికారులకు తెలియజేశారు. దీంతో ఆ ఇద్దరు రైలు డ్రైవర్లకు ఉన్నతాధికారులు బహుమతి ప్రకటించారు. వారిని అభినందించారు.
వీడియో వైరల్.. లోకో పైలట్లపై ప్రశంసలు
ఆ బాలుడు, అతని 14ఏళ్ల సోదరుడు పట్టాల సమీపంలో ఆడుకుంటుండగా.. అతడు రైలు కిందపడినట్లు తెలుస్తోంది. బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు ఇద్దరు లోకో పైలట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.












Click it and Unblock the Notifications