వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hatespeech: టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
న్యూస్ చానెల్

దేశంలో విద్వేష వ్యాఖ్యల వ్యాప్తికి టీవీ ఛానెళ్లలో చర్చలే ప్రధాన కారణమని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

టీవీ చర్చల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ''కేంద్ర ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా అన్ని చూస్తోంది, ఇది చాలా చిన్న సమస్యగా భావిస్తోంది’’అని కోర్టు అన్నది.

ఈ తరహా చర్చల నియంత్రణకు ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రిషీకేశ్ రాయ్‌లు సభ్యులుగాగల ధర్మాసనం సూచించింది.

మీడియాకు అతిపెద్ద ముప్పు టీవీల్లో చర్చలేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, టీవీల్లో చర్చల నియంత్రణకు మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటోందా, లేదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది.

''విద్వేషాల నుంచి టీఆర్‌పీ పెరుగుతోంది, టీఆర్‌పీ నుంచి లాభాలు వస్తున్నాయి’’అని కోర్టు అన్నది.

ప్రభుత్వం ఈ విషయంలో చట్టాన్ని తీసుకొచ్చేలోగా తాము కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తామని కూడా కోర్టు స్పష్టంచేసింది.

చర్చల విషయంలో టీవీ చానెళ్లకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఘాటైన సూచనలు చేయడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ఏం జరిగింది?

2020లో సుదర్శన్ న్యూస్ చానెల్‌లో ''యూపీఎస్‌సీ జిహాద్’’పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఏం చర్యలు తీసుకోకపోవడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు.

'యూపీఎస్‌సీ జిహాద్‌’ ప్రోగ్రాంను ఆపేయాలని యూపీ హైకోర్టు మొదట 2020 సెప్టెంబర్ 10న ఆదేశాలు జారీచేసింది. అయితే, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి ఇచ్చింది.

కార్యక్రమ నిర్వహణకు ముందుగా స్క్రిప్ట్ తాము అడగలేమని, కార్యక్రమం నిర్వహించకముందే అడ్డుకోవడం సాధ్యపడదని అనుమతులు ఇచ్చేటప్పుడు కేంద్రం చెప్పింది.

న్యూస్ చానెల్

''మీడియాకు మీడియానే ముప్పు’’

మీడియాకు దేశంలోని ప్రధాన వార్తా చానెళ్లే ముప్పు లాంటివని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

దిల్లీలో ఆసియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్‌మెంట్ నిర్వహించిన సదస్సులో అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు.

''నిజమైన జర్నలిజం అంటే వాస్తవాలు చెప్పడం, అన్ని కోణాలనూ ప్రేక్షకుల ముందు ఉంచడం, అందరి అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వడం. నా అభిప్రాయ ప్రకారం, ఇవాళ మీడియాకు అతిపెద్ద ముప్పు డిజిటల్ మీడియా అసలు కాదు. ప్రధాన వార్తా చానెళ్లే మీడియాకు ముప్పుగా మారుతున్నాయి. మీరు అతిథులను కార్యక్రమానికి ఆహ్వానిస్తే, వారు ప్రజలను విభజించే, విద్వేషాన్ని వ్యాపింపచేసే వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. అలా లేనిపక్షలో మీ చానెల్ విశ్వసనీయతను మీరే తగ్గించుకుంటున్నారు’’అని అనురాగ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు టీవీ చానెళ్ల చర్చలరకు గెస్టులుగా వెళ్లేవారు కూడా ముందుగా ఆ చానెల్ చరిత్ర గురించి తెలుసుకోవాలని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యంగా శైలి, మాట తీరు, ప్రసారం చేస్తున్న దృశ్యాలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

2020లో సుదర్శన్ న్యూస్ కేసును విచారిస్తున్న మసయంలో కేంద్రం తరఫున సోసిలిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్రం సమగ్ర, సవివర మార్గదర్శకాలను తీసుకొస్తోందని చెప్పారు.

ప్రభుత్వం ఎలా నియంత్రించగలదు?

టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే కంటెంట్‌ను నియంత్రించేందుకు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్– 1994ను తీసుకొచ్చారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, సామాజిక సమస్యలు సృష్టించేలా ఎలాంటి సమాచారాన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేయడానికి వీల్లేదు. సగంసగం నిజాలు చెప్పే వార్తలు కూడా ప్రసారం చేయకూడదు.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నిబంధనల ప్రకారం.. వార్తా చానెళ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అయితే, ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయబోతున్నారో కూడా పరిగణలోకి తీసుకుంటుంది.

చానెల్ మొదలుపెట్టకముందే, అన్ని చానెళ్లూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.

అయితే, 2011లో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం, సమాచార ప్రసార శాఖకు మొదటగా సదరు వార్తా చానెల్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఈ అభ్యర్థనను మంత్రిత్వ శాఖ పరిశీలించిన అనంతరం హోంశాఖకు పంపిస్తారు. అక్కడ భద్రతా పరమైన ముప్పులు ఏమైనా ఉంటాయేమోనని విశ్లేషిస్తారు.

ప్రతి చానెల్‌కు పదేళ్ల సమయానికి అనుమతులు ఇస్తారు. ఆ తర్వాత లైసెన్సును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కేబుల్ టెలివిజన్ చట్టంలోని నిబంధనలను కూడా చానెళ్లు పక్కాగా అనుసరించాలి.

ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కావాలంటే చానెల్ అనుమతులను కేంద్రం రద్దు చేయొచ్చు.

ఎలాంటి ఫలితమూ లేదు..

2007లో ప్రధాన న్యూస్ చానెళ్లు అన్ని కలిసి న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)ను ఏర్పాటుచేశాయి. నైతిక, ఆపరేషనల్ సమస్యల పర్యవేక్షణకు దీన్ని తీసుకొచ్చారు.

అయితే, చాలా టీవీ చానెళ్లు ఎన్‌బీఏ నిబంధనలను అనుసరించడం లేదు. ఆ తర్వాత న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండార్డ్ అథారిటీ (ఎన్‌బీఎస్ఏ)ను ఏర్పాటుచేశారు. జస్టిస్ జేఎస్ వర్మను దీనికి చైర్మన్‌గా నియమించారు.

ఎన్‌బీఎస్ఏ ఒక స్వతంత్ర సంస్థ. దీనిలో పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తూ నాలుగు న్యూస్ చానెళ్ల ఎడిటర్‌లు ఉంటారు.

అయితే, ఎన్‌బీఎస్ఏ నిబంధనలను కూడా వార్తా సంస్థలు అనుసరించడం లేదు.

2019లో రిపబ్లిక్ మీడియా గ్రూప్ ఎడిటన్ ఆర్ణబ్ గోస్వామి నేతృత్వంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ పేరుతో మరో బ్రాడ్‌కాస్ట్ రెగ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు. కొన్ని లోకల్ చానెళ్లు దీనిలో సభ్యులుగా ఉన్నాయి.

సుదర్శన్ చానెల్ కేసు కోర్టుకు వచ్చినప్పుడు తమ సంస్థను ప్రాధికార సంస్థగా గుర్తించానలి ఎన్‌బీఎస్ఏ కోరింది. తమ సంస్థలో సభ్యత్వం ఉన్నా లేకపోయినా, అందరూ తమ నిబంధనలు పాటించేలా చూడాలని కోర్టును సంస్థ కోరింది. అయితే, ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

సుప్రీం కోర్టు

కోర్టు ఏం చెప్పింది?

అసలు విద్వేష వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతోందని కోర్టు బుధవారం ప్రశ్నించింది.

టీవీ చానెళ్ల డిబేట్లపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చాలా చర్చల్లో పాల్గొంటున్న గెస్టులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేజే నటరాజ్‌కు సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. ''అసలు మీ సమస్య ఏమిటి? మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’అని కోర్టు ప్రశ్నించింది.

''ఇక్కడ యాంకర్ల బాధ్యత కూడా చాలా ముఖ్యం. టీవీ డిబేట్లలో పాల్గొనేవారు విద్వేష వ్యాఖ్యలు చేయకుండా వారు కట్టడి చేయాలి’’అని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hatespeech: Are discussions on TV channels fueling hatred in the country, what should the anchors do, Supreme Court says?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X