అశుతోష్ మహారాజ్ అంత్య క్రియలు 15 రోజుల్లోగా పూర్తి చేయండి: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: జలంధర్‌లోని నుర్మాహాల్‌కు చెందిన దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ చీఫ్ అశుతోష్ మహారాజ్ జనవరి 29, 2014న మరణించినట్లు సంస్థాన్ వైద్యులు స్పష్టం చేశారు. ఆయన మరణించి ఇప్పటికీ 10 నెలలైనా, మళ్లీ తిరిగి వస్తాడని నమ్ముతున్న భక్తులు దాచి ఉంచిన ఆయన పార్ధీవ దేహానికి 15 రోజుల్లోగా అంత్యక్రియలు పూర్తి చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలకు సంబంధించి ఓ కమిటీని వేయాల్సిందిగా కోరింది. ఈ కమిటీలో హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ హోదా కలిగిన సీనియర్ ఆఫీసర్లను నియమించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం అశుతోష్ మహారాజ్ పార్ధీవ దేహాన్ని డీప్ ప్రిజ్‌లో ఉంచారు.

ఈ విషయంలో దాఖలైన పలు పిటీషన్‌లను విచారించిన ఆ రాష్ట్ర కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మహారాజ్ భక్తులకు తాము నమ్మినదాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ, హిందూ మతంలో మృత దేహాలను భద్ర పరిచే సంస్కృతి లేదని హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎం.బేడి వ్యాఖ్యానించారు.
కాగా, కోర్టు తీర్పు వెలువడగానే, వేలాది మంది అశుతోష్ మహారాజ్ భక్తులు, మద్దతుదారులు ఆశ్రమానికి పోటెత్తారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications