సెంటిమెంట్: కుమారస్వామికి ఆ ఇల్లే 'లక్కీ', ఆ భవనంలోకి మారగానే సీఎం ఛాన్స్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జెడి(ఎస్) నేత కుమారస్వామి తనకు లక్కీ భవనంగా భావించే జేపీ నగర్‌లోని తన నివాసం నుండే పరిపాలనను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ముఖ్యమంత్రులకు కర్ణాటకలో అనుగ్రహ భవనాన్ని కేటాయిస్తారు. అయితే ఈ భవనం నుండి పాలన సాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని భావించారు. ఈ భవనం కూడ వాస్తు పరంగా ఇబ్బందులు కూడ ఉన్నాయని ప్రచారం. దీంతో ఈ భవనంలోకి వెళ్ళేందుకు కుమారస్వామి ఇష్టపడలేదని సమాచారం.
దీనికితోడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రత్నప్రభ నివాసం ఉంటున్న భవనం వాస్తుపరంగా మెరుగ్గా ఉంది. ఈ భవనంలోకి కూడ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ భవనంలోకి మారుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ కుమారస్వామి మాత్రం జేపీ నగర్ లోని తన నివాసం నుండే పరిపాలన సాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

జెపీ నగర్ ఇంటి నుండే పాలన
బెంగుళూరులోని జెపీ నగర్ నివాసం నుండే కర్ణాటక సీఎం కుమారస్వామి పాలన సాగించాలని భావిస్తున్నారు. ఈ నివాసంలోకి మారిన తర్వాతే అన్ని రకాలుగా కలిసివచ్చిందని కుమారస్వామి నమ్ముతారు. ఈ కారణంగానే ఈ ఇంటి నుండే పాలన కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కేటాయించే బంగ్లాలోకి వెళ్ళకూడదని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.

సినిమా రంగం నుండి సీఎంగా ఈ ఇంట్లోనే
జేపీ నగర్ ఇంట్లో ఉన్న సమయంలోనే కుమారస్వామి సినీ రంగంతో పాటు రాజకీయంగా ఎదిగారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ ఇంట్లో ఉన్న సమయంలోనే కుమారస్వామి సినీ రంగంలో ప్రవేశించారు.ఈ ఇంట్లో ఉండగానే ఆయన సినీరగంలో పంపిణిదారుడిగా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తరువాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో ఆయన సీఎం గా ఎన్నికయ్యారు.

ఎన్నికలకు ముందే జేపీ నగర్ ఇంట్లోకి
2007లో సీఎంగా బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వాత కుమారస్వామి ఈ ఇంటి నుండి మరో ఇంట్లోకి మారారు. అయితే 2018 ఎన్నికలకు ముందు కుమారస్వామి ఈ ఇంట్లోకి మారారు. కొందరు జ్యోతిష్యుల సలహ మేరకు ఈ ఇంటికి మరమ్మత్తులు నిర్వహించి ఈ ఇంట్లోకి మారారు. ఈ ఇంటి నుండే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల తర్వాత అనుహ్యంగా ముఖ్యమంత్రి పదవి కుమారస్వామికి దక్కింది.

ఇలా ప్రజలను కలుసుకొనేందుకు కృష్ణ బంగ్లా
ప్రభుత్వ బంగ్లా కృష్ణలో కేవలం ప్రజలను కలుసుకొనేందుకు వినియోగించుకోవాలని సీఎం కుమారస్వామి భావిస్తున్నారని సమాచారం. ఈ నివాసంలోనే ప్రజలతో కలుసుకోనున్నారు. అనుగ్రహ భవనం వాస్తు పరంగా మెరుగైంది కాదని కుమారస్వామి భావిస్తున్నారు. మరో వైపు ఈ భవనంలో ఉన్న సీఎంలు పూర్తి కాలం పాటు ఈ పదవిలో లేరు. దీంతో తాను నివాసం ఉంటున్న జేపీ నగర్ భవనానికి కుమారస్వామి మొగ్గు చూపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications