వర్ష బీభత్సం: 72 మంది మృతి- రూ.4 వేల కోట్లు గంగపాలు..!!
సిమ్లా: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
#WATCH | Furiously flowing Beas river engulfs a truck in Kullu of Himachal Pradesh
— ANI (@ANI) July 10, 2023
(Video shot by a local and confirmed by police) pic.twitter.com/jkT6B8yzB9
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఆయా నదులపై నిర్మించిన బాస్పా, వాంగ్టో, నథ్పా రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు.

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కోతకు గురయ్యాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కొండ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించేలా విరుచుకుపడటం వల్ల పలు పట్టణాలు సగం వరకు నీట మునిగాయి.
కాంగ్రా, బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్‌పూర్, మండి, కుల్లు-మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వచ్చే మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
ఇతర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని ఐఎండీ సూచించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ సెంటర్లను నెలకొల్పింది. 24 గంటల పాటు పని చేసేలా వాటిని ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ కేంద్రాల నంబర్లు...1100, 1070, 1077.
ఈ మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 72 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గల్లంతయ్యారు. 4,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తినష్టం సంభవించినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం తెలిపింది. ఈ మూడు రోజుల వ్యవధిలో 350 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications