రంగులకేళి హోలీ... ప్రధాని మోడీతోపాటు సీఎం జగన్, సీఎం కేసీఆర్ తదితర ప్రముఖుల శుభాకాంక్షలు
భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ పండుగ సందర్భంగా ప్రజలు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా ప్రజలకు సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

కులమతాలకు అతీతంగా జరుపుకునే ఉత్సవం హోలీ
కులమతాలకతీతంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ జరుపుకునే హోలీ పండుగ. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా హోలీ పండుగను ప్రజలు సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గి ఈ పరిస్థితిలో మార్పు వచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం హోలీ పండుగ జరుపుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. రంగుల పండుగ హోలీని యువత సెలబ్రేట్ చేసుకుంటుంది.
ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ: ప్రధాని మోడీ
హోలీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తెలిపిన శుభాకాంక్షలలో ఈ పండుగ అందరి జీవితాలలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు పేర్కొన్న ఆయన ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాలలో ఆనందాన్ని తీసుకురావాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, ముక్తార్ అబ్బాస్ నక్వీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంద్రధనస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా.. ఏపీ సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. వసంతఋతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీ దేశవ్యాప్తంగా ఆనందంగా ఉల్లాసంగా జరుపుకుంటారని పేర్కొన్న ఆయన ఇంద్రధనస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
కలిసి మెలిసి జరుపుకునే వేడుక : తెలంగాణా సీఎం కేసీఆర్ హోలీ విషెస్
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ : పవన్ కళ్యాణ్
ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఉల్లాసకరమైన పండుగ హోలీ అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు వసంత ఋతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవం గా జరుపుకునే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ నా తరఫున, జనసేన తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు వెల్లడించారు.

ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని విజ్ఞప్తి
మన దేశంలో వివిధ పేర్లతో వివిధ పురాణాల నేపథ్యంలో ఈ పండుగ జరుపుకుంటున్నప్పటికి భారతీయుల ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోంది . రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగ వేళ ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం సుఖశాంతులు విరబూయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పండుగను ప్రకృతిపరంగా లభించే సహజ సిద్ధమైన రంగుల మిశ్రమాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అందరినీ ఒక్కటి చేసే ఆనందమే హోలీ : చంద్రబాబు
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండుగ మీ ఇంటిల్లిపాదికీ అనేక సంతోషాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అందరినీ ఒక్కటి చేసే ఆనందమే హోలీ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగుదేశం అంటూ ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications