పంజాబ్ లో ఆప్ గెలిస్తే ? దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా ? కీలక సమీకరణాలివే
ప్రస్తుతం యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో జరగబోయే ఎన్నికల్లో అందరి కళ్లూ యూపీపైనే ఉన్నాయని భావిస్తుండగా.. పంజాబ్ లో చోటు చేసుకునే పరిణామాలు కూడా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా అక్కడ అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీల్ని కాదని మరో విపక్షం ఆప్ సాధించబోతున్న విజయం కచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పంజాబ్ పోరు కూడా బీజేపీకి కీలకంగా మారిపోయింది.
Recommended Video

పంజాబ్ లో ఆప్ జోరు
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తర్వాత పంజాబ్ పోరుపై అందరి దృష్టీ ఉందని భావిస్తుండగా.. ఇప్పుడు యూపీతో సమానంగా పంజాబ్ కూడా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కీలకంగా మారిపోతోందని తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ అధికారం కోల్పోతే తమ చేతుల్లో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఒకదాంట్లో హస్తం పార్టీ ప్రాభవం ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీకి సైతం ఇక్కడ భవిష్యత్తులో తమ ఉనికిని చాటుకోవాలంటే విజయం తప్పనిసరిగా మారిపోయింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గెలవకపోతే మాత్రం కచ్చితంగా ఢిల్లీ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. అదే సమయంలో పంజాబ్ లో ఆప్ గెలుస్తుందని ఇప్పటికే అన్ని సర్వేలు తేల్చిచెప్పేశాయి.

ఢిల్లీ సీన్ రిపీట్ ?
గతంలో ఢిల్లీలో ఆప్ స్పల్ప మెజారిటీతో గట్టెక్కింది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తమ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన ఆప్ ను దెబ్బతీశాయి. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాని ప్రభావంతో కాంగ్రెస్ పూర్తిగా మటు మాయం కాగా.. బీజేపీ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ గురించిన చర్చ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పంజాబ్ లోనూ ఆప్ గెలిస్తే అక్కడ కూడా రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోవడం ఖాయంగా కనిపిస్ోతంది. దీంతో పంజాబ్ లో ఆప్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

దేశ రాజకీయాలపైనా ప్రభావం
పంజాబ్ లో ఆప్ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా దేశ రాజకీయాల్లోనూ పెనుమార్పులు తప్పేలా లేవు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ తో ముఖాముఖీ పోరాడుతున్న టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ, శివసేవంటి పార్టీలకు ప్రస్తుతం తమ రాష్ట్రాలు దాటితే బలం శూన్యం. కానీ ఆప్ పరిస్దితి అలా కాదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఇప్పటికే పంజాబ్ లో విపక్షంగా కూడా ఉంది. ఈసారి పంజాబ్ లో గెలిచి అధికారం చేపడితే ఆప్ చేతుల్లోకి రెండో రాష్ట్రం వచ్చినట్లవుతుంది. దీంతోపాటు ఢిల్లీ సీఎంగా ఉన్న ఆప్ అధినేత కేజ్రివాల్ పాపులారిటీ మరింత పెరగడం ఖాయం. అదే సమయంలో మోడీతో పోరాడుతున్న కేజ్రివాల్ కు అండగా నిలిచేందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా క్యూ కట్టే అవకాశముంది. ఇలా ఏ విధంగా చూసినా పంజాబ్ లో ఆప్ విజయం కచ్చితంగా దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయాన్ని చూపించే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications