బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత- భారీగా మోహరించిన పోలీసులు
ఇంఫాల్: సుమారు రెండు నెలలకు పైగా హింసాత్మక పరిస్థితులతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ కొలిక్కి రావట్లేదు. మణిపూర్ పరిస్థితులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు.
ఈ పరిస్థితుల మధ్య కొద్దిసేపటి కిందట పలువురు ఆందోళనకారులు ఇంఫాల్‌లోని బీజేపీ ప్రాతీయ కార్యాలయంపై దాడికి దిగారు. వందలాది మంది పార్టీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు చేరుకోవడం, నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వారిలో కొందరు పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లడానికీ ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు, భద్రత బలగాలు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ వారు అక్కడి నుంచి కదల్లేదు. రోడ్డుపైనే బైఠాయించడం మొదలుపెట్టారు. దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీనితో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సుమారు 40 నిమిషాలు పలు రౌండ్ల మేర టియర్ గ్యాస్‌ను సంధించారు. దీని తరువాత ఆందోళనకారులు చెదిరిపోయారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఇంఫాల్ పోలీస్ కమిషనర్ వివరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు చెప్పారు.
#WATCH | A crowd gathered near the regional office of BJP in Imphal, Manipur. Police used several rounds of tear gas shells to stop and disperse them.
— ANI (@ANI) June 29, 2023
Visuals from the spot. pic.twitter.com/9NvUUoM68c
కాగా- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ నిర్వహించ తలపెట్టిన పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో కాన్వాయ్‌కు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్‌లో సహాయ శిబిరంలో తలదాచుకుంటోన్న వారిని పరామర్శించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దీనితో చురచంద్‌పూర్‌లో మాత్రమే హింసాకాండ బాధితులను రాహుల్ గాంధీ పరామర్శించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఇంఫాల్‌కు తిరిగి వచ్చారు. రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం నాడు ఆయన మళ్లీ చురచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్‌లో పర్యటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications