మాస్కులు ధరించకుంటే నిత్యావసరాలు బంద్.. అక్కడ లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినం
కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ మీద చావు దెబ్బ కొడుతుంది . ఇక కరోనా వ్యాప్తిపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి . ఇక దీంతో లాక్ డౌన్ నిబంధనలను కరోనా ప్రభావం బాగా ఉన్న ప్రాంతాలలో మరింత కఠినం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . ఇక ఈ క్రమంలోనే యూపీలోని బలరాంపూర్ జిల్లా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
చెప్పిన మాట వినకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారికి తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించని పక్షంలో వారికి నిత్యావసరాలు విక్రయించ వద్దని ఇప్పటికే అన్ని సరుకులు విక్రయించే షాపులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే బలరాంపూర్ అధికార యంత్రాంగం జిల్లాలోని వారికి స్పష్టమైన ఉత్తరువులు ఇచ్చింది . దీంతో దుకాణదారులందరూ మాస్కులు లేని వారికి నిత్యావసరాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు . మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఎలాంటి వస్తువులు విక్రయించరాదని అధికారుల ఆదేశాలను ఫాలో చేస్తున్నారు .

ఇక ఈ విషయంలోనే కాదు కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో సామాజిక దూరాన్ని పాటించటం కూడా తప్పనిసరి చేశారు . ఇక ఎవరైనా సామాజిక దూరం పాటించకున్నా సరే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్నే ఎస్పీ దేవరంజన్ వర్మ చెప్తూ లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామన్నారు . ప్రజలు మాస్క్ ధరించకుండా వస్తే ఏ వస్తువులూ అమ్మకూడదని దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చామని , మెడికల్ షాపులు, కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, విత్తన షాపులు సహా అన్ని షాపుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అతిక్రమించే దుకాణదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications