మొదలైన నోట్ల కష్టాలు: ఏటీఎంలలోనూ రూ. 2వేల నోట్లు; బ్యాంకులకు క్యూ కడుతున్న జనాలు!!
రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఈమేరకు సంచలన ప్రకటన చేసింది. రెండు వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని, లేదా ఇతర నోట్లలోకి మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆర్బిఐ పేర్కొంది.
అయితే రెండువేల రూపాయలను నోట్లను మార్చుకునే క్రమంలో ఒక చిన్న ట్విస్ట్ కూడా పెట్టింది. ప్రతిరోజు కేవలం 20000 రూపాయల 2 వేల రూపాయల నోట్లు మాత్రమే బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా నిబంధన విధించింది. దీంతో రెండు వేల రూపాయల నోట్లను కలిగి ఉన్న వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు.

సెప్టెంబర్ చివరి వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచి రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఇక క్యాష్ డిపాజిట్ మిషన్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే, మరో చిక్కు కూడా జనాలకు వచ్చి పడింది.
డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని ఏటీఎంలకు వెళుతున్న వారికి అక్కడ కూడా 2 వేల రూపాయల నోట్లే రావటం మరింత షాక్ కు గురి చేస్తుంది. దీంతో ఖాతాదారులు మళ్లీ బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల బ్యాంక్ అధికారులు మాత్రం రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవడం, డిపాజిట్ చేయడం ఇంకా ప్రారంభించలేదని మళ్లీ రావాలని చెబుతున్న పరిస్థితి ఉంది.
దీంతో చాలా మంది నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయం పైన సామాన్య, మధ్య తరగతి ప్రజలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక మెజారిటీ ప్రజానీకం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరిలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ బడా బాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications