పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు; సామాన్యులకు షాక్; బండ బాదుడు నేటినుండే!!
నేటి నుండి గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలు, అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ల ధరలను చమురు సంస్థలు పెంచాయి. లేటెస్ట్ ధరలు ఇలా ఉన్నాయి.
సామాన్యులకు మార్చి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నెత్తిమీద మరో పెద్ద పిడుగు పడింది. అసలే అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుండి గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలు, అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రజల పైన ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.

సామాన్యులకు షాక్ ఇస్తున్న పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
మార్చి ఒకటో తేదీ.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒక షాకింగ్ డేలా మొదలైంది. మార్చి నెల ప్రారంభంలోనే పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇలా అయితే కష్టమే అనే భావనను కలుగజేస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ధరల మోత మోగుతుంటే మరో మారు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ప్రజల జేబులు ఖాళీ కావాల్సిందే అన్న భావన వ్యక్తం అవుతుంది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 350రూపాయల అదనపు భారం
ఇక తాజాగా పెరిగిన ధరల వివరాలలోకి వెళితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా 350 రూపాయల మేర పెరిగాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 2119 రూపాయలకు చేరుకుంది. ఇంతకుముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1769 రూపాయలుగా ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 350.50 పైసలు పెంచడంతో ప్రస్తుతం ఢిల్లీలో రూ. 2119.50 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గా ఉంది.

ముంబై, చెన్నై, కలకత్తా లలో కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా
ఇక కలకత్తాలో చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1870 రూపాయల నుంచి 2221 రూపాయలకు పెరిగింది. ముంబైలో ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ ధర 1721 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం దీని రేటు 2071 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర కమర్షియల్ ఇంతకుముందు 1917 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 2268 రూపాయలకు పెరిగింది.

గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల అదనపు భారం
ఇదిలా ఉంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల విషయానికి వస్తే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర 50 రూపాయల మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగటం మళ్ళీ ఇప్పుడే తొలిసారి. అయినా పెరిగిన ధర సామాన్యులకు, మధ్యతరగతి ప్రాలకు ఊహించని షాక్ అనే చెప్పాలి. గతంలో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తివెయ్యటంతో ఈ ధరల భారం మా వల్ల కాదని అంటున్నారు సామాన్య , మధ్యతరగతి ప్రజలు.

తెలుగురాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా
14.2 కిలోల ఎల్పిజి గృహ వినియోగాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 1103 రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణాలోనూ గ్యాస్ సిలిండర్ ధర 1150 రూపాయలకు చేరుకుంది. ముంబైలో 1102 రూపాయలు, కోల్ కత్తాలో 1129 రూపాయలు, చెన్నైలో 1118 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇక ఈ ధరలు మార్చి 1వ తేదీ నుండి.. అంటే నేటి నుండి అమలులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications