ముగిసిన భారత్-చైనా 12వ కార్ప్ కమాండర్ లెవల్ చర్చలు: 9 గంటలపాటు సరిహద్దులో శాంతిపై చర్చ
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో శనివారం భారత్, చైనాల మధ్య 12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ లెవల్ చర్చలు జరిగాయి. ఉదయం ప్రారంభమైన చర్చలు శనివారం రాత్రి 7.30 గంటలకు ముగిశాయి. ఈశాన్య లడఖ్ సెక్టార్‌లో బలగాల ఉపసంహరణ, శాంతి పరిస్థితులు తిరిగి తీసుకురావడంపై సుమారు 9గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో చర్చించుకున్నారు.
Recommended Video
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భూభాగంలోని మోల్డోలో ఈ సమావేశం జరిగింది. ఈశాన్య లడఖ్ ప్రాంతం(హాట్ స్ప్రింగ్, గోగ్రా పోస్టు ఏరియాలు కూడా)లో పూర్తిగా బలగాల ఉపసంహరణపై భారత్, చైనా కీలకంగా చర్చించారు. కాగా, 3 నుంచి 4 నెలల తర్వాత మళ్లీ ఈ చర్చలు జరగడం గమనార్హం. ఏప్రిల్ 9న ఎల్ఏసీ వెంట భారత భూభాగంలోని చుహుల్ బోర్డర్ పాయింట్ వద్ద 11 రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలు 13 గంటలపాటు కొనసాగాయి.

చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరిపిన రెండు వారాల తర్వాత 12 రౌండ్ మిలిటరీ చర్చలు జరగడం గమనార్హం. ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా మాత్రం సరిహద్దులో బలగాలను పెంచడం, నిర్మాణాలు కూడా చేపడుతుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. చైనా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటేనే సరిహద్దులో మునుపటి శాంతి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని భారత్.. చైనాకు తేల్చి చెప్పింది.
చైనా బలగాలను వాస్తవాధీన రేఖ, ఈశాన్య లడక్ సమీపంలో నుంచి ఉపసంహరించుకుంటే.. భారత్ కూడా తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని తెలిపింది. గత ఏడాది గల్వాన్ లోయలో భారత జవాన్లపై చైనా ఆర్మీ దాడులకు పాల్పడిన తర్వాత నుంచి సరిహద్దులో శాంతి పరిస్థితులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలైనా సఫలం అవుతాయో కాదో త్వరలోనే తేలనుంది. ఎందుకంటే, ఓవైపు శాంతి మంత్రం చెబుతూనే.. మరోవైపు బలగాలను పెంచుతూ, ఎల్ఏసీ వెంట శాశ్వత నిర్మాణాలను చెబుడుతూ డ్రాగన్ దేశీ ఉద్రిక్తలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications