చైనా దుస్సాహసాన్ని అడ్డుకున్న భారత్-అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాటు యత్నం విఫలం
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దులపై చైనా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ లోకి దాదాపు వంద ట్రూపుల చైనా బలగాలు గుర్రాలపై వచ్చి వెళ్లినట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు చైనా బలగాలు విఫలయత్నం చేశాయి.
దాదాపు రెండొందల మంది చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న తవాంగ్ సెక్టార్ లోకి టిబెట్ వైపు నుంచి చొరబడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ బలగాలు వారి్ని తిప్పికొట్టాయి. తవాంగ్ సెక్టార్ సలో ఖాళీగా ఉన్న సైనికుల బంకర్లను ధ్వంసం చేసేందుకు చైనా బలగాలు ప్రయత్నించినట్లు భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. అయితే భారత రక్షణ వ్యవస్ధలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించాయి. భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికుల్లో కొందరిని పట్టుకుని నిర్బంధించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

చైనా సరిహద్దుల్లోని బుమ్లా, యాంగ్తే కనుమల మధ్య ఈ చొరబాటు ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే చైనా సైనికుల్ని తాత్కాలికంగా మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే చైనా వైపు నుంచి భారత సైన్యానికి కవ్వింపులు పెరిగాయి. అలాగే సరిహద్దుల్లో త్వరలో రాబోయే శీతాకాలం నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్దితుల మధ్య చొరబాట్లకు ఎక్కువగా అవకాశం కూడా ఉంటుంది. దీంతో చైనా బలగాలు ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై కన్నేసినట్లు అర్ధమవుతోంది.
Recommended Video
అయితే తాజాగా తూర్పు లడఖ్ లో పర్యటించిన ఆర్మీ ఛీఫ్ నరవణే.. ప్రస్తుతానికి పరిస్ధితులు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన వారం లోపే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. దీంతో తూర్పు లడఖ్ తో పాటు టిబెట్ వైపు ఉన్న చైనా సరిహద్దులోనూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ గస్తీ పెంచబోతోంది.












Click it and Unblock the Notifications