మోడీ నోరు విప్పించేందుకే ? ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం లక్ష్యమిదే !
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఉభయసభలు ముందుకు సాగడం లేదు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మూడు నెలలుగా అల్లర్లు కొనసాగుతున్నా, మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా కేంద్రం స్పందన పేలవంగా ఉంది. ప్రధాని మోడీ ఇప్పటివరకూ అక్కడ పర్యటించలేదు. పార్లమెంట్ లో సైతం తాను స్పందించకుండా హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి నిరసనగా ఇవాళ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ప్రధాన లక్ష్యం మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ నోరువిప్పించడమే. ప్రధాని మోడీ మణిపూర్ ఘటనలపై రెండు నెలలుగా మౌనంగా ఉండిపోయి, తాజాగా మహిళల నగ్న ప్రదర్శన వీడియోలు బయటపడ్డాక దేశం సిగ్గుపడుతోందంటూ చెప్పి తప్పించుకున్నారు. దీనిపై విపక్షాలు నాలుగు రోజులుగా పార్లమెంట్ ను స్తంభింపచేస్తున్నా కేంద్రం మాత్రం మౌన వ్రతం పాటిస్తోంది. దీంతో అవిశ్వాస తీర్మానం ద్వారా చర్చ పెట్టిస్తే ప్రధాని మోడీ ప్రకటన చేస్తారనే లక్ష్యంతో కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమి ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇవ్వడానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ఇచ్చిన నోటీసుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 50 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. ఇదేమంత కష్టం కాదు. కానీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మాత్రం ఎంపీల మద్దతు లేదు. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించి చర్చ చేపట్టిన తర్వాత అన్ని పార్టీల ఎంపీలు మాట్లాడతారు. అనంతరం ప్రధాని ప్రకటన కూడా ఉంటుంది. చివరిగా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో నెగ్గేందుకు ఎన్డీయే కూటమికి 331 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ విపక్ష ఇండియా కూటమికి కేవలం 144 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష ఇండియా కూటమిలో పార్టీలన్నీ మద్దతిస్తే 144 ఓట్లు మాత్రమే వస్తాయి.
అలాగే బీఆర్ఎస్ కూడా చివర్లో దీనికి మద్దతిస్తే మరో 9 ఓట్లు వస్తాయి. అలా చూసినా 153 ఓట్లు మాత్రమే లభిస్తాయి. వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు ఎలాగో బీజేపీకి అండగా నిలుస్తాయి. దీంతో ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. కానీ ప్రధాని మోడీ ప్రకటన కోసమే విపక్షం ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇందులో నెగ్గకపోయినా ప్రధానితో మణిపూర్ ఘటనలపై ప్రకటన చేయిస్తే అదే తమ విజయంగా భావిస్తోంది.












Click it and Unblock the Notifications