దేశంలో బంగ్లాదేశ్ తరహా అనిశ్చితి- కేంద్రం ఎలా డీల్ చేయగలిగింది?
Bangladesh crisis: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అక్కడ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్నాయి. చివరికి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.
సరిగ్గా అలాంటి పరస్థితులే భారత్‌లో తలెత్తగా కేంద్ర ప్రభుత్వం దీన్ని విజయవంతంగా అడ్డుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దేశాన్ని అస్థిరపరిచడానికి కొన్ని విదేశీ శక్తులు విశ్వప్రయత్నాలు చేశారని, దీన్ని సకాలంలో అడ్డుకోగలిగిందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ తరహా అనిశ్చిత పరిస్థితిని భారత్ విజయవంతంగా నివారించగలిగిందని నిపుణులు అంచనా వేస్తోన్నారు.

అశాంతిని ప్రేరేపించడానికి కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం, సకాలంలో తీసుకున్న కొన్ని చర్యలు దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగాయని అంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి గల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీకి చెందిన ఈస్ట్ కమాండ్ ఏడీజీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడం దీనికి ప్రధాన కారణంగా అభివర్ణిస్తోన్నారు. ఈ కమిటీని ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
సమస్యాత్మక ప్రాంతాల్లో నివసిస్తోన్న స్థానికులు, హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రత కోసం బంగ్లాదేశ్‌తో కలిసి పని చేసేలా ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితులను అధ్యయనం చేసింది. కేంద్రానికి నివేదిక అందిస్తూ వచ్చింది.
భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానం బంగ్లాదేశ్ తరహా నష్టాన్ని నివారించగలిగిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్ సీనియర్ ఫెలో అభిజిత్ అయ్యర్ మిత్రా అభిప్రాయపడ్డారు. ఒమిడ్యార్ నెట్‌వర్క్, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వంటి సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కారణంగా భారత్‌లో అనిశ్చిత పరిస్థితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తోన్నాయని పేర్కొన్నారు.
విదేశీ ఎన్జీఓల నుంచి పెద్ద ఎత్తున భారత్‌కు అందే నిధులను నియంత్రించడం కూడా బంగ్లాదేశ్ తరహా అశాంతియుత వాతావరణం, అనిశ్చితిని నివారించగలిగిందని అభిజిత్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో నివసించే హిందువులు 1971 నుంచి అటు రాజకీయంగా, ఇటు మతపరంగా దాడులను ఎదుర్కొంటున్నారని భారత విదేశాంగ విధానం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల నిపుణుడు ప్రమిత్ పాల్ చౌధురి అభిప్రాయపడ్డారు. 1971 మారణహోమం సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని, అక్కడ ఉండే బెంగాలీ మేధావి వర్గాన్ని ఉద్దేశపూరకంగా నిర్మూలించే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు, సంఘటనల నుంచి భారత్ సులభంగా బయటపడగలిగిందని, తన శక్తి సామార్థ్యాలను చాటుకోగలిగిందని ప్రమిత్ పాల్ చౌధురి పేర్కొన్నారు.
గ్రేటా థెన్‌బెర్గ్, పాప్ సింగర్ రిహన్నా వంటి అంతర్జాతీయ వ్యక్తులు రైతుల ఉద్యమాన్ని ప్రభావితం చేయడం ద్వారా భారత్‌లో అశాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం దృఢంగా నిలవగలిగిందని ప్రమిత్ చౌదరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications