గుట్టుగా అణ్వస్త్రాలను పెంచుకుంటున్న భారత్..! US రిపోర్ట్- శత్రువుల గుండెల్లో రైళ్లు..!
భారత్ కు (India) గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ముప్పు పెరుగుతోంది. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్, ఈ మధ్య శత్రువులుగా మారుతున్న ఒకప్పటి మిత్రులు నేపాల్, బంగ్లాదేశ్.. ఇలా ఎటు చూసినా ప్రతికూల పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణాలు ఏవైనా.. భవిష్యత్తులో ఈ ముప్పును సమర్ధంగా ఎదుర్కోవాల్సిందే. అందుకే భారత్ తన అణ్వస్త్రాలను (Nuclear Arsenal) పెంచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ 'ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్' (FAS) తాజా నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.
భారత్ తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం పటిష్టం చేసుకుంటోంది. దీనిలో భాగంగా దేశీయంగా అణు అస్త్రాల సంఖ్యను పెంచుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అణు వార్‌హెడ్‌ల సంఖ్య సుమారు 190కి చేరింది. కొత్త క్షిపణుల తయారీ కోసం ఇవి సిద్ధమవుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఇప్పటివరకూ మనకు 160 అణు వార్‌హెడ్‌లు ఉండగా, కొత్తగా మరో 30 అస్త్రాలు వీటికి చేరాయని 'ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ - 2026' అనే పరిశోధనా పత్రంలో పేర్కొంది. మన దేశం అధికారికంగా ఈ గణాంకాల్ని ఎప్పుడూ వెల్లడించనప్పటికీ, ప్రభుత్వ బహిరంగ ప్రకటనలు, శాటిలైట్ చిత్రాలు, రక్షణ రంగానికి చెందిన నివేదికల ఆధారంగా విదేశీ రక్షణ విశ్లేషకులు ఈ కీలక పరిణామాలను అంచనా వేశారు.

భారత్ ప్రస్తుతం తొమ్మిది రకాల వ్యూహాత్మక అణు వాహక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. వీటిలో రెండు యుద్ధ విమానాలు, ఆరు రకాల భూగర్భ క్షిపణులు, ఒక సముద్ర ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ప్రధానమైనవి. ముంబైలోని ప్రసిద్ధ 'ధ్రువ' రియాక్టర్‌తో పాటు తమిళనాడు కల్పక్కంలో ఉన్న 500 మెగావాట్ల 'ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్' ద్వారా దేశీయంగా అణు ఇంధన లభ్యత పెరిగింది. ఈ కొత్త రియాక్టర్ ద్వారా ఏటా దాదాపు 35 అణు వార్‌హెడ్‌ల తయారీకి సరిపడా ఇంధనం లభిస్తుందని అంచనా. సరిహద్దుల్లో మారుతున్న భద్రతా సమీకరణాల నేపథ్యంలో భారత్ తన సైనిక వనరులను స్థిరంగా బలోపేతం చేస్తోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం దాదాపు 170 అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు స్వీడన్‌కు చెందిన రక్షణ పరిశోధన సంస్థ 'సిప్రి' (SIPRI) గతంలో వెల్లడించింది. అయితే చైనా, పాక్ వంటి దేశాల నుంచి ఎదురవుతున్న ద్విముఖ సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టేలా భారత్ తన వ్యూహాత్మక స్థావరాన్ని, అణు క్షిపణుల పరిధిని పెంచుకుంటోంది.














Click it and Unblock the Notifications
