Worst hit Country: భారత్ కంటే బ్రెజిల్ బెటర్: కరోనా స్పీడ్ 63%: 30 లక్షలమందికి పైగా మృతి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 30 లక్షలను దాటేశాయి. గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. వ్యాక్సిన్ పైనే ఆధారపడ్డాయి.

30 లక్షల మందికి పైగా..
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 30,33,109 మంది మరణించారు. పాజిటివ్ కేసులు 14,20,18,609 మేర నమోదు అయ్యాయి. అమెరికాలో కరోనా కాటుకు ఇప్పటిదాకా 5,81,061 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,04,463కు చేరింది.అన్ని దేశాల కంటే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైంది అమెరికాలోనే. ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదైంది మన భారత్‌లోనే. పాజిటివ్ కరోనా కేసుల జాబితాలో ఇదివరకు బ్రెజిల్‌ది రెండోస్థానం. భారత్ మూడో స్థానంలో ఉండేది. ఇప్పుడా స్థానాలు తలకిందులయ్యాయి.

రెండో స్థానంలో భారత్..
భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య కోటిన్నరను దాటేసింది. ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం భారత్‌లో 1,50,61,919 కేసులు రికార్డ్ అయ్యాయి. అదే బ్రెజిల్‌లో నమోదైన కేసులు 1,39,43,071. మరణాలు రేటు అక్కడ భారత్ కంటే అధికంగా ఉంటోంది. బ్రెజిల్‌లో 3,73,442 మంది మరణించగా.. భారత్‌లో ఆ సంఖ్య 1,78,769గా నమోదైంది. అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు మరణాల్లో అగ్రరాజ్యం అమెరికా.. అగ్రరాజ్యంగానే కొనసాగుతోంది. 3,24,04,463 కరోనా కేసులు నమోదు కాగా.. 5,81,061 మంది చనిపోయారు.

వారం రోజుల్లో 63 శాతం కరోనా కేసులు పెరుగుదల..
వారం రోజుల వ్యవధిలో నమోదైన కరోనా వైరస్ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో అమెరికా సైతం రెండో స్థానానికే పరిమితమైంది. వారం రోజుల వ్యవధిలో భారత్‌లో 63 శాతం మేర కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటి పెరుగుదల అనూహ్యంగా ఉంటోంది. అదే సమయంలో అమెరికా, బ్రెజిల్ మైనస్‌లోకి వెళ్లాయి. అమెరికాలో మైనస్ 3, బ్రెజిల్‌లో మైనస్ 7 శాతం మేర కేసులు నమోదు కాగా.. భారత్‌లో ఆ సంఖ్య 63 శాతం మేర అధికంగా కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్రెజిల్‌లో ఇప్పటిదాకా 3,73,442మంది చనిపోయారు. 1,39,43,071 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి మెక్సికోలో 2,12,339 మంది మరణించారు.

లక్షకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశాలివే..
లక్షకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశాల జాబితా క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఫ్రాన్స్ చేరింది. అమెరికా-581,061, బ్రెజిల్-3,73,442, మెక్సికో-2,12,339 మంది చనిపోయారు. కరోనా మరణాల్లో ఈ మూడు దేశాల తరువాత భారత్ నిలిచింది. భారత్‌లో 1,78,793 మంది మృత్యువాత పడ్డారు. బ్రిటన్-1,27,270, ఇటలీ-1,16,927, రష్యా-1,05,582, ఫ్రాన్స్-1,00,733 మంది అసువులు బాశారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications