పాక్ కుట్రలకు చెక్ .. పాకిస్తాన్ పంపిన చైనీస్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం
పాకిస్తాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు పాక్ సైన్యం పరోక్షంగా సహాయం చేస్తోంది అని సమాచారం .అయితే ఇండియన్ ఆర్మీ వీరి ప్రయత్నాలను తిప్పికొడుతుంది .

పాక్ కుట్రలకు చెక్ పెడుతున్న ఇండియన్ ఆర్మీ
భారత్లో ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారాన్ని నిఘా సంస్థలు వెల్లడించడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బోర్డర్ లో బలగాలను అలర్ట్ చేసింది. కదలికలు ఉన్న ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తూ ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది.
ఉగ్రవాద స్థావరాలను కనుక్కుంటూ పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకుంటుంది.

చైనాతో కలిసి పాకిస్థాన్ కుట్రలు .. భారత్ లో విధ్వంసం టార్గెట్ గా
నీలం లోయ వందల సంఖ్యలో భారత్ లోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా నిరోధిస్తుంది. ఇండియాలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తోన్న పాకిస్తాన్ గుట్టు ఇప్పటికే పలుమార్లు రట్టు అయింది. చైనాతో కలిసి పాకిస్తాన్ ఇండియా పై కుట్ర చేస్తోంది. అందులో భాగంగా ఉగ్రవాదులను పంపి ఇండియాలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోంది.

పాకిస్థాన్ పంపిన డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం
ఉగ్రవాదుల కుట్ర ద్వారా సహాయ సహకారాలను అందిస్తూ, ఆయుధాలను సైతం డ్రోన్ల ద్వారా పంపిస్తున్న పాకిస్తాన్ ఆగడాలకు ఇండియన్ ఆర్మీ చెక్ పెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ పంపించిన పలు డ్రోన్లను భారత సైనికులు కూల్చివేశారు. భారత్ వైపు వచ్చిన డ్రోన్స్ లలో చైనా డ్రోన్స్ కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా ఉన్న డ్రోన్ ను భారత సైనికులు గమనించారు. పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గా గుర్తించడంతో దానిని వెంటనే కూల్చివేశారు.

కుప్వారా జిల్లాలో చైనా కంపెనీ డ్రోన్ కూల్చివేత
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ డ్రోన్ ను కూల్చేశారు ఇండియన్ ఆర్మీ. పాక్ దుశ్చర్యలను అడ్డుకోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు చెబుతున్నారు. చలికాలంలో బోర్డర్లో మంచు అధికంగా ఉండే ప్రాంతాల నుండి ఉగ్రవాదులను బోర్డర్ దాటించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని వారు పేర్కొన్నారు. ఇక ఈ డ్రోన్ ను చైనా కంపెనీ అయిన డీజేఐ తయారు చేసిందని దాని పేరు మావరిక్ 2 ప్రో అని చెప్పారు .