అమానుషం : మగబిడ్డను కనలేదని భార్యపై సలసల కాగే నీళ్ళు పోసిన శాడిస్ట్ భర్త ఘాతుకం
దేశంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు మన నాగరిక సమాజంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న అమానుష ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందామని, అంతరిక్షం దాకా దూసుకుపోతున్నామని మనం సాధించిన ప్రగతిని పదే పదే చెప్పుకుంటున్న వేళ సమాజంలో చోటు చేసుకుంటున్న అమానుష ఘటనలు మనం సాధించిన ప్రగతిని ప్రశ్నిస్తున్నాయి. మన నాగరికతను అవహేళన చేస్తున్నాయి.

మగబిడ్డను కనలేదని భార్యను హింసించిన భర్త
మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు ఓ భర్త. ఎవరూ చేయని అకృత్యానికి ఒడిగట్టాడు. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని కోపంతో, ఒక మగ పిల్లాడిని కూడా కన లేదన్న ఆగ్రహంతో భార్యపై సలసల కాగే నీళ్ళు పోశాడు. భర్త చేసిన అకృత్యానికి ఆ భార్య హాహాకారాలు చేస్తూ అల్లాడి పోయింది. అత్యంత అమానవీయంగా, అమానుషంగా భార్యపై, భర్త చేసిన ఈ దాడి వివరాల్లోకి వెళితే,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ లో సత్యపాల్ అనే వ్యక్తి 2013లో సంజు అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వారికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు.

భార్యపై సలసల కాగే నీళ్ళు పోసిన భర్త
మగ పిల్లవాడిని కనలేదన్న కోపంతో సత్యపాల్ భార్యను నిత్యం వేధించేవాడు. ఆమెకు భోజనం కూడా పెట్టకుండా నరకయాతన చూపించేవాడు. పుట్టింటి నుండి అదనపు కట్నం 50 వేల రూపాయలు తీసుకు రావాలంటూ హింసించేవాడు. ఈ క్రమంలోనే భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఈ నెల 13వ తేదీన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఒక్క మగ పిల్లవాడిని కూడా కనలేదని సలసల కాగిన నీళ్లను భార్య మీద పోశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ఇల్లాలు హాహాకారాలు చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

చావుబతుకుల మధ్య బాధిత మహిళ. పరారైన శాడిస్ట్ భర్త
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య పై వేడి నీళ్లు పోసిన సదరు కిరాతక భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి ముగ్గురు చిన్నారులు, అందునా ఆడకూతుళ్ళు విలవిలలాడుతున్నారు.
ఆడపిల్లలైనా , మగ పిల్లలు అయినా ఇద్దరూ సమానమేనని, లింగ వివక్షకు మనదేశంలో తావులేదని పదే పదే ప్రచారం చేస్తున్నా ఇంకా జనాలలో మార్పు రావటం లేదు.

అనాగరికంగా ప్రవర్తిస్తున్న మృగాళ్ళలో మార్పు రాకుంటే అబలలు బలి కావాల్సిందే
మగ పిల్లల కోసం భార్యలను వేధిస్తున్న వారు, కడుపులో ఉన్నది ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయిస్తున్నారు ఉన్నారు. కేవలం మగ పిల్లల కోసం ఆడపిల్లలను హతమారుస్తున్న వారు, భార్యలను చంపేస్తున్న వారు సైతం లేకపోలేదు. నాగరిక సమాజంలో జీవిస్తున్నా ఇంకా అనాగరికంగా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న వారున్నారు. మగపిల్లలే కావాలనే భావజాలంతో ఉన్న వారిలో మార్పు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. లేదంటే ఆడపిల్లలను కన్నారన్న కారణంగా ఎందరో అబలలు ఇట్లా నిత్యం బలైపోవలసిందే.












Click it and Unblock the Notifications