స్వాతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీకి అవమానం..!
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని ముందుండి నడిపించడమే కాకుండా పార్లమెంట్ లో బలమైన విపక్షాన్ని నిర్మించి లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం అవమానం ఎదురైంది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో ప్రదాని మోడీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది.
గత పదేళ్లలో తొలిసారి ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తొలి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం మాత్రం ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా ఎక్కడో వెనుక సీటు కేటాయించింది. వాస్తవానికి ప్రధాని తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్ గాంధీని మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉండగా.. రెండో వరుసలో ఇచ్చారు. తొలి వరుసలో మాత్రం కేంద్రమంత్రులతో పాటు ఒలింపిక్ పతక విజేతలు కొందరు కూర్చొన్నారు.

రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంతో అక్కడే మరికొందరు ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి రాహుల్ గాంధీ కూర్చొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పలువురు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నారు. ముందు వరుసలలో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ వంటి ఒలింపిక్ పతక విజేతలు ఉన్నారు. ఒలింపిక్-కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పిఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ గాంధీ కంటే ముందు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications