IRCTC అదిరిపోయే ఆఫర్.. అతితక్కువ ధరకే 9 రోజుల్లో జపాన్ టూర్!
ఇంటర్నేషనల్ టూర్ చేయాలని, ముఖ్యంగా సాంకేతికతకు, ప్రకృతి అందాలకు నిలయమైన జపాన్ దేశాన్ని సందర్శించాలని చాలామందికి కల ఉంటుంది. కానీ ప్లానింగ్, టికెట్లు, వీసాలు అనుకుంటూ సమయం గడిచేకొద్దీ ఆ ప్లాన్ వాయిదా పడుతుంటుంది. ఇలాంటి వారి కోసం ఇండియన్ రైల్వేస్ (ఐఆర్‌సీటీసీ) ఒక సరికొత్త స్పెషల్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ముంబై నుంచి నేరుగా జపాన్ తీసుకెళ్లేలా 9 రోజుల సూపర్ లగ్జరీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
అక్టోబర్ 25న ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ కలల ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎయిర్ ఇండియా విమానంలో రాత్రికి రాత్రే జపాన్ రాజధాని టోక్యోకు చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే మన దేశపు రుచులతో స్వాగతం లభిస్తుంది. అనంతరం టోక్యోలోని ప్రముఖ 'టీమ్‌లాబ్ ప్లానెట్స్' డిజిటల్ ఆర్ట్ మ్యూజియం, చారిత్రాత్మక ఉయేనో పార్క్ అందాలను వీక్షించవచ్చు. మరుసటి రోజు సెన్సో-జీ టెంపుల్, ఆకాశాన్ని తాకే టోక్యో స్కై ట్రీ, కలర్‌ఫుల్ గేమింగ్ హబ్ అకిహాబారా, వరల్డ్ ఫేమస్ షిబుయా క్రాసింగ్ వద్ద సందడి చేసే అవకాశం ఉంటుంది.

మంచు కొండలు.. మంత్రముగ్ధులను చేసే ప్రకృతి!
మూడో రోజు జపాన్ ఐకాన్ అయిన ఫుజీ పర్వత శ్రేణులను సందర్శిస్తారు. కేబుల్ కార్ ద్వారా హాకోన్ రోప్‌వే ప్రయాణం, ఆషి సరస్సులో పైరేట్ షిప్ క్రూయిజ్ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. నాల్గో రోజు టెక్నాలజీ లవర్స్ కోసం నాగోయాలోని ప్రసిద్ధ టొయోటా మ్యూజియం లేదా మ్యాగ్లెవ్ రైల్వే పార్క్ విజిట్ ఉంటుంది.
చరిత్ర, సాంస్కృతిక వైభవం కళ్లముందే..
ఐదో రోజు క్యోటోలోని బాంబూ గ్రోవ్ (వెదురు వనాలు), బంగారు వర్ణంలో మెరిసిపోయే 'కింకాకు-జి' ఆలయం, వేలాది ఆరెంజ్ గేట్లతో ఆకట్టుకునే 'ఫుషిమి ఇనారి' దివ్యక్షేత్రాన్ని చూపిస్తారు. ఆరో రోజు నారా పార్క్‌లో స్వేచ్ఛగా తిరిగే జింకలతో సమయం గడపవచ్చు. ఏడో రోజు ప్రసిద్ధ బుల్లెట్ రైలు (షింకన్సేన్) ఎక్కి హిరోషిమాకు పయనం అవుతారు. అక్కడ ప్రశాంతతను పంచే పీస్ మెమోరియల్ పార్క్, నీటిపై తేలియాడేటట్లు ఉండే ఇట్సుకుషిమా ఆలయాన్ని సందర్శిస్తారు.
సుమో కుస్తీలు.. లగ్జరీ ఎండ్!
ఎనిమిదో రోజు తిరిగి టోక్యో వచ్చి, జపాన్ సాంప్రదాయక 'సుమో' షోను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారీ గుండమ్ విగ్రహం, ఒడైబా వాటర్ ఫ్రంట్ ఈ పర్యటనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తొమ్మిదో రోజు ఉదయం ఉపాహారం ముగించుకుని, స్వీట్ మెమొరీస్‌తో టోక్యో నుంచి ముంబైకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఖర్చు ఎంత?.. ప్యాకేజీలో ఏమేమి వస్తాయి?
ఈ 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ ధరలు రూ. 3.36 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
- ట్విన్/ట్రిపుల్ షేరింగ్ (ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉంటే): ఒక్కొక్కరికి రూ. 3,36,200
- సింగిల్ ఆక్యుపెన్సీ (ఒక్కరే ఉండేలా అయితే): రూ. 4,14,770
- పిల్లలకు (మంచంతో సహా): రూ. 3,36,200
- పిల్లలకు (మంచం లేకుండా): రూ. 2,63,100
(గమనిక: ఈ ధరలకు అదనంగా 2 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది).
ఆందోళన అక్కర్లేదు.. అంతా ఐఆర్‌సీటీసీ బాధ్యతే!
ఈ ప్యాకేజీ తీసుకుంటే ఇక దేని గురించీ ఆలోచించాల్సిన పనిలేదు. ముంబై - జపాన్ రానుపోను విమాన టికెట్లు, 3-స్టార్ హోటళ్లలో బస, ఏసీ బస్సుల్లో ప్రయాణం, ఇండియన్ ఫుడ్, దర్శనీయ ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, బుల్లెట్ రైలు టికెట్లు, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, సహాయంగా ఉండేందుకు గైడ్.. అన్నీ ఐఆర్‌సిటిసీయే చూసుకుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు














Click it and Unblock the Notifications