కాశ్మీర్ ఉగ్రవాద దాడి: మిలిటెంట్ల వద్ద పాక్ మార్క్ ఫుడ్ ప్యాకెట్లు

ఎదురు కాల్పుల సంఘటన స్థలం వద్ద దొరికి ఆహార పదార్థాల ప్యాకెట్లు సాధారణంగా పాకిస్తాన్ సైన్యం ఉపయోగించేవని ఓ సీనియర్ సైనికాధికారి చెప్పారు. అక్కడ దొరికిన ఫుడ్ ప్యాకెట్లను, ఆయుధాలను, ఆయుధ సామగ్రిని పరిశీలిస్తే చాలా కాలంగా మిలిటెంట్లు పథకం వేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు.
సంఘటనా స్థలంలో 55 మాగజీన్లతో కూడిన ఆరు ఎకె రైఫిళ్లు, రెండు షాట్ గన్స్, రెండు రాత్రిపూట వాడే బైనాక్యులర్లు, నాలుగు రేడియో సెట్లు, 32 ఉపయోగించని గ్రెనేడ్లు, ఓ మెడికల్ కిట్ దొరికినట్లు చెప్పారు. ఈ సంఘటనను బట్టి పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మిలిటెంట్లను భారత భూభాగంలోకి పంపిస్తున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు.
కాశ్మీర్‌లో శుక్రవారంనాడు మిలిటెంట్లు నాలుగు చోట్ల దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. సంఘటన స్థలంలో భారత సైన్యం స్వాధీనం చేసుకున్న ఫుడ్ ప్యాకెట్లపై ఉర్దూ మార్కింగ్స్ ఉన్నాయి. అవి సాధారణంగా పాకిస్తాన్ సైన్యం వాడేవని చెబుతున్నారు. చాలా కాలంగా మిలిటెంట్లు కాపు కాస్తున్నట్లు ఫుడ్ ప్యాకెట్లను బట్టి అర్థమవుతోందని అంటున్నారు.
మిలిటెంట్ల దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్‌సహా 8మంది జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించారు. లష్కరే తాయిబా కమాండర్‌సహా 8 మంది ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. ఉగ్ర దాడిలో ఒక పౌరుడు కూడా మరణించాడు. శీతకాలపు నిశిరాత్రి బారాముల్లా జిల్లా యూరి సెక్టార్ మొహ్రా వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడిచేశారు. తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో సైనిక శిబిరానికి వస్తున్న క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టీ) వాహనంపై కాల్పులు జరిపారు. ఆ వాహనం అదుపుతప్పి పక్కకు ఒరిగిపోగానే సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించి, ఒక ఉగ్రవాదిని క్షణాల్లో మట్టుబెట్టారు.
ఆ తర్వాత భారీగా కాల్పులు జరిగాయి. ఆ సమయంలో కిరోసిన్ హీటర్ దొర్లిపడి సైనికుల టెంట్లకు నిప్పంటుకుంది. ఇటు నిప్పు, అటు కాల్పుల మధ్య జవాన్లు చిక్కుకున్నారు. ఈ పోరులో... పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సంకల్ప్ కుమార్, మరో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు. జవాన్లలో నలుగురు అగ్ని కీలలకు బలైపోయారు. ఆరున్నర గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు ప్రకటించారు.
ఆ తర్వాత వారినుంచి 6 ఏకే రైఫిళ్లు, 55 మాగజీన్లు, రెండు షాట్‌గన్లు, నైట్‌విజన్ బైనాక్యులర్లు, 4 రేడియో సెట్లు, మెడికల్ కిట్‌తోపాటు దీర్ఘకాల పోరుకు పనికొచ్చే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బారా ముల్లా జిల్లాలో ఈనెల 9న పోలింగ్ జరగనుండగా... ప్రధాని మోదీ సోమవారం యూరీలో ఎన్నికల సభలో ప్రసంగించనున్నారు.












Click it and Unblock the Notifications