అసెంబ్లీకి సోమవారమే తెలంగాణ బిల్లు: జైరాం
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు సోమవారం రాష్ట్రపతి నుంచి రాష్ట్ర శాసనసభకు సోమవారం వెళ్లే అవకాశం ఉందని జివోఎం సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. రాష్ట్ర శానసభలో ఏమవుతుందనేది తనకు తెలియదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తాము చేసిన కసరత్తుపై ఆయన దాదాపు గంటపాటు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. శాసనసభ నుంచి రాష్ట్రపతికి వచ్చిన తర్వాత తిరిగి ముసాయిదా బిల్లు మంత్రివర్గానికి వస్తుందని, ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్తుందని ఆయన వివరించారు.
రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ
పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని, రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చించామని, అయితే ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు. రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ కారణాలతోనే రాయల తెలంగాణ వెనక్కి వెళ్లిందని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోలవరం కోసం ఎంతో కష్టపడ్డారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు.

సీమాంధ్ర రాజధాని ఎక్కడ..
సీమాంధ్ర రాజధానిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పల్లంరాజు కోరారని ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధానికి విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే జివోఎంలో ఉన్నారని ఆయన చెప్పారు. జివోఎం 53రోజులు పనిచేసిందని, రాష్ట్రానికి చెందిన అందరినీ సంప్రదించామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు, సీమాంధ్రకు చెందిన ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వట్టి వసంతకుమార్‌లతో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా జివోఎం నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని ఆయన చెప్పారు. ఐదు రోజులపాటు భద్రాచలంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
సిఎం ఇప్పుడెవరో తెలియదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు తెలుసునని, ఇప్పుడు ఆయనెవరో తనకు తెలియదని జైరాం రమేష్ అన్నారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సహకరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications