కాక్రోచ్ ల దెబ్బకు..: జంతర్ మంతర్ ఇక ధర్నాలకు వేదిక కాదు: కేంద్రం తాజా నిర్ణయం: సర్కులర్
దేశ రాజధానిలో దశాబ్దాలుగా వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నిరసనలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వచ్చిన జంతర్ మంతర్ ఇకపై ధర్నా వేదికగా అందుబాటులో ఉండదు. ఈ ప్రదేశాన్ని అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించింది. డీనోటిఫై చేసింది. ప్రజా ఆందోళనల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక, సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో పౌరులు తమ ఆందోళనలను తెలియజేసే రాజ్యాంగబద్ధ హక్కును సులభతరం చేస్తూనే సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో కొత్త ప్రదేశాలను ఎంపిక చేశారు. హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం.. రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను నిరసనల కోసం నూతనంగా కేటాయించిన వేదికలుగా ఖరారు చేశారు. ఇకపై ఎలాంటి ధర్నాలు గానీ, ర్యాలీలు గానీ, ప్రదర్శనలు గానీ నిర్వహించాలన్నా ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ మూడు వేదికల్లో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఆందోళనకారులు పాటించాల్సిన భద్రతా నియమాలు, ముందస్తు అనుమతుల ప్రక్రియ, సౌండ్ పరిమితులు, హాజరయ్యే నిరసనకారుల సంఖ్య, సమయం.. వంటి గైడ్‌లైన్స్ అన్నీ కూడా వీటిల్లో పొందుపరచనున్నారు.
ఢిల్లీ నడిబొడ్డున ఉండటం, పార్లమెంట్ భవనం, ప్రధాన మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు అతి సమీపంలో ఉండే జంతర్ మంతర్ వద్ద నిరంతరం ధర్నాలు జరగడం వల్ల రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్రం భావిస్తోంది. సెంట్రల్ ఢిల్లీ పరిధిలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు స్థానిక వ్యాపారులు, నివాసితులు ఈ నిరసనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతోంది. భద్రతాపరంగా అత్యంత సున్నిత ప్రాంతం కావడం వల్ల సెంట్రల్ ఢిల్లీలో శాంతిభద్రతల సమస్యలను నివారించడానికి ప్రత్యామ్నాయ వేదికల ఏర్పాటు అవసరమని కేంద్ర కమిటీ వెల్లడించింది.
గతంలో ఇండియా గేట్ పరిసరాలలో నిరసనలను నిలిపివేసినట్లే, ఇప్పుడు జంతర్ మంతర్‌ను కూడా డీనోటిఫై చేయడంతో లూటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో నిరసనల శకానికి ముగింపు పడినట్లయింది. నూతనంగా ప్రతిపాదించిన రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లు పరిమాణంలో చాలా విశాలంగా ఉంటాయి. భారీ ఎత్తున జనసమీకరణ జరిగినా నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగవని కేంద్రం అంచనావేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న కొత్త ఎస్‌ఓపీ అధికారికంగా విడుదలైన తర్వాత మాత్రమే ఢిల్లీ పోలీసులు కొత్తగా కేటాయించిన వేదికల్లో నిరసనల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ, రవాణా వ్యవస్థ, వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చేయడంతో పాటు పౌరుల నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కుకు భంగం కలగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.













Click it and Unblock the Notifications
