శశికళకు చెక్: జయ మేనకోడలు దీపానే అన్నాడీఎంకే చీఫ్ !
జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమే అని, జయలలితకు దీపా రక్తసంబంధికురాలు అని అన్నాడీఎంకేలోని ఓ వర్గం గుర్తు చేస్తున్నారు. అలాంటి దీపాకు ఎందుకు అన్నాడీఎంకే పదవి ఇవ్వరు ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని అమ్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీ పేరుతో తమిళ ప్రజలకు దివంగత ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) ఎలాంటి సేవలు అందించారో అందరికి తెలుసని అంటున్నారు. ఎంజీఆర్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్న ఓకే ఒక వ్యక్తి అమ్మ జయలలిత అని చెబుతున్నారు.

జయలలిత అకాలమరణం తరువాత అన్నాడీఎంకే పార్టీని సత్తలేని వారి చేతుల్లో పెడితే మొదటికే మోసం వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. జయలలిత పేరు నిలబెట్టాలంటే ఆమె కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
జయలలితకు ప్రతిరూపంగా అచ్చు గుద్దినట్లు ఉండే ఆమె మేనకోడలు దీపాను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రాంతంలో జయలలిత, దీపాల ఫోటోలతో పెద్ద ఎత్తున భారీ ఫ్లక్సీలు ఏర్పాటు చెయ్యడంతో శశికళ వర్గంలోని నాయకులు హడలిపోతున్నారు. ఇంతకాలం తెరమరుగున ఉన్న జయ మేన కోడలు దీపాకు ఇంత పబ్లిసిటి ఏందుకు ఇస్తున్నారు అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అన్నాడీఎంకే పార్టీలో ఇంత వరకు శశికళకు ఎలాంటి పదవి లేదని, ఇప్పుడు ఆమెను అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా ఎందుకు చేస్తున్నారు అంటూ అన్నాడీఎంకేలోని ఓ వర్గం ప్రశ్నిస్తుంది. జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమే అని, దీపా జయలలిత రక్త సంబంధికురాలు అని గుర్తు చేస్తున్నారు.
అలాంటి దీపాకు ఎందుకు అన్నాడీఎంకే పదవి ఇవ్వరు ? అని ప్రశ్నిస్తూ దక్షిణ తమిళనాడులో పెద్ద ఎత్తున ప్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దెబ్బతో శశికళ వర్గంలోని నాయకుల దిమ్మ తిరగడంతో పాటు సామాన్య కార్యకర్తలకు ఏమీ సమాధానం చెప్పాలి ? అంటూ అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications