మూడో జన్మ వచ్చింది, మరోసారి సీఎం అవుతా, మనకు మంచే జరుగుతుంది, మీరే చూడండి !
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కర్ణాటక మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాను మళ్లీ కర్ణాటక సీఎం అవుతానంటూ వ్యాఖ్యలు చెయ్యడంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయ వర్గాల్లో గుబులు మొదలైంది.
ఈ విషయమై హాసన్‌లో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో కర్ణాటక రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయని, ఆ భగవంతుడు మీకు సేవ చేయడానికి తనకు మరొక అవకాశం ఇస్తాడని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నేను మూడుసార్లు గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్నాను. మీ ఆశీస్సుల వల్లే నాకు మూడో జన్మ వచ్చిందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

ఈ జన్మలోనే మీకు మరో ఏడాదిలోగా సేవ చేసే అవకాశం వస్తుందని సీఎం కుమారస్వామి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయం అంటే అది ప్రవహించే నీరు లాంటిది, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు ఎప్పటికీ తెలియదని, ప్రత్యర్థులకు కూడా ఆ విషయం తెలియదని కుమారస్వామి అన్నారు. జేడీఎస్ ఎక్కడ ఉందంటూ కొందరు నాయకులు అంహకారంతో మాట్లాడుతున్నారని, జేడీఎస్ తో గతంలో పొత్తు పెట్టుకోవడం వలనే వాళ్లు అధికారం అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారని మరిచిపోయారని కుమారస్వామి మండిపడ్డారు.
ఐదేళ్లు అధికారం ఇచ్చి మధ్యలో వారిని మేము తొలగించడం లేదని, కొత్త జీవితం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నానని, పక్కనే కూర్చుని గొయ్యి తవ్వడం లేదని, తనకు గతంలో ఎవరెవరు ఏమేమి చేశారు అనే విషయాలు అన్నీ గుర్తున్నాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. మీ ప్రభుత్వాన్ని ఎవరు తొలగించారో హాసనాంబే గుడికి వచ్చి ప్రమాణం చేయండి అని డీకే శివకుమార్ చేసిన సవాల్‌పై కుమారస్వామి స్పందించారు;
ఎందుకు ప్రమాణం చేయాలి? ధర్మస్థలంలోని ఆయుర్వేద ఆసుపత్రి నుంచి కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్లాన్ చేసింది మీరు, ఇప్పుడు హాసనాంబే గుడికి వచ్చి ఎందుకు ప్రమాణం చెయ్యాలని డీకే శివకుమార్ ను ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు అన్నిరకాలుగా ఆలోచించి ఓటు వెయ్యాలని, ప్రజలను మభ్యపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే లోక్ సభ ఎన్నికల్లో తగినబుద్ది చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి ప్రజలకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications