చోరీలు చేస్తూ తండ్రికి వెండి విగ్రహం చేయించాడు
బెంగళూరు: ప్రజల సొత్తును కొల్లగొడుతూ తండ్రి, అన్నకు వెండి విగ్రహాలు చేయించి పూజలు చేస్తున్నాడు ఓ దొంగ. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దొంగను అరెస్టు చేసి వెండి విగ్రహాలు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుజరాత్ లోని ఓడెకు చెందిన తలపాడ్ నాగవాస్ అలియాస్ శంకర్ ఓ దొంగ. ఇతని కుటుంబ సభ్యులు అందరూ చోరీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
శంకర్ ఓ జోతిష్యుడిని కలిశాడు. చోరీ చేసిన వెండితో మీ తండ్రికి వెండి విగ్రహం చేయిస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని జోతిష్యుడు సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడి సలహా మేరకు శంకర్ విచ్చల విడిగా చోరీలు చేశాడు.10 కిలోల వెండితో తండ్రికి, అరకిలో వెండితో అన్న విగ్రహాలు తయారు చేయించాడు.

ఆ విగ్రహాలకు నిత్యం పూజలు చెయ్యడం మొదలు పెట్టాడు. విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే శంకర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. జ్యోతిష్యుడి సలహామేరకే తాను తండ్రి, అన్నయ్యల విగ్రహాలు తయారు చేయించానని శంకర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
శంకర్ కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ అద్దె ఇండ్లు తీసుకుని నివాసం ఉండేవారు. అదును చూసుకుని చోరీలు చేసి సొంత రాష్ర్టానికి పారిపోయేవారని పోలీసులు చెప్పారు. 2007 నుంచి శంకర్ బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.
బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలు చేస్తున్నాడు. విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చెయ్యడానికి ప్రయత్నించి అరెస్టు అయ్యాడని పోలీసులు చెప్పారు. బెంగళూరు నగరంలోనే రూ. ఐదు కోట్ల విలువైన చోరీలు చేశాడని పోలీసులు అన్నారు.
చోరీ చేసిన సొత్తుతో గుజరాత్ లో ఐదు భవంతులు కొనుగోలు చేశానని శంకర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. శంకర్ అతని కుటుంబ సభ్యులు ఎన్ని ప్రాంతాల్లో చోరీలు చేశారు అని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications