Kaali: అమ్మవారి నోట్లో సిగరెట్: భారత హైకమిషనర్ జోక్యం: సారీ చెప్పిన ఆగా ఖాన్ మ్యూజియం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన స్మోకింగ్ కాళి పోస్టర్ వ్యవహారంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది. దీనిపై వివరణ కోరింది. తమిళనాడుకు చెందిన ఫిల్మ్‌మేకర్ లీనా మణిమేఖలై రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్ వ్యవహారంపై సమగ్ర నివేదికను అందించాలంటూ కెనడాలోని భారత హైకమిషన్ కార్యాలయానికి సూచించింది. అలాగే అక్కడి ఆగా ఖాన్ మ్యూజియానికీ నోటీసులను పంపించింది.
కాళి పేరుతో లీనా మణిమేఖలై రూపొందిస్తోన్న డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్ పోస్టర్ అది. కాళిక అమ్మవారు సిగరెట్ తాగుతున్నట్టు దీన్ని డిజైన్ చేశారు. ఓ చేత్తో త్రిశూలం, మరో చేత్తో స్వలింగ సంపర్కుల సమాజానికి గుర్తుగా ఉపయోగించే జెండాను పట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ అయిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ఫిల్మ్ మేకర్ మణిమేఖలై ఆటలాడుతున్నారంటూ మండిపడుతున్నారు ట్విట్టరెటీలు. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

కాళి పేరుతో రూపుదిద్దుకుంటోన్న డాక్యుమెంటరీ వెంటనే నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్‌లల్లో లీనాపై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫ్యూషన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) యూనిట్ అధికారులు లీనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 295ఏ కింద మణిమేఖలైపై కేసు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసులు పెట్టారు.
ప్రస్తుతం లీనా మణిమేఖలై కెనడాలో ఉంటోన్నారు. అక్కడి ఆగా ఖాన్ మ్యూజియం కోసం ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనితో కెనడాలోని భారత హైకమిషన్ కార్యాలయం జోక్యం చేసుకుంది. ఆగా ఖాన్ మ్యూజియం నుంచి వివరణ కోరింది. నోటీసులను జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. ఆ వెంటనే ఆగా ఖాన్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
కాళీ పోస్టర్ వల్ల భారత్‌లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారిస్తున్నామని తెలిపింది. క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. అండర్ ద టెంట్ అనే బ్యానర్ కింద మొత్తం 18 షార్ట్ వీడియోలను ఆహ్వానించామని, టోరంటో మెట్రో పాలిటన్ యూనివర్శిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మణిమేఖలై కాళీ పేరుతో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తోన్నట్లు వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications