కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: కేంద్రంతో సమానం, 30 శాతం జీతాలు!
బెంగళూరు: కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంఫర్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఆరో వేతన సంఘం శుభవార్త చెప్పడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచాలని ఆరో వేతన సంఘం శిఫారసు చేసింది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు సరిసమానం అవుతాయి.

బేసీక్ జీతం
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ఆరో వేతన సంఘం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బుధవారం న సమర్పించిన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ జీతంపై 30 శాతం పెంచాలని సిఫారసు చేసింది. పింఛనుదారులకు కూడా ఇదే సిఫారసులు వర్తిస్తాయని ఆరో వేతన సంఘం తెలిపింది.

ఉద్యోగులు అందరికీ
ప్రభుత్వ ఉద్యోగులు 5. 2 లక్షల మంది, పింఛనుదారులు 5.73 లక్షల మంది ఉన్నట్లు ఆరోవేతన సంఘం నివేదికలో తెలిపింది. ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బోధనేతర సిబ్బంది మరో 73 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆరో వేతన సంఘం వివరించింది.

రూ. 17 వేల నుంచి రూ. 1.32 లక్షలు
కనిష్ట వేతనం రూ.16,350 , గరిష్ఠ వేతనం రూ.1,32, 925 ఉండాలని ఆరో వేతన సంఘం తెలిపింది. పింఛనుదారులకు నెలకు కనీస పింఛను రూ.8, 500, గరిష్ఠ పింఛను రూ.73, 000, అదనంగా డీఏ ఇవ్వాలని ఆరో వేతన సంఘం పేర్కొంది.

ఐదు రోజులు ఉద్యోగం
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరిసమానం చెయ్యాలని, ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని, జయంతి, వర్దంతి సెలవులు రద్దు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పనితీరును అనుసరించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం సిద్దూ క్లారిటీ
ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాట్లాడుతూ వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చిస్తామన్నారు. మంత్రి వర్గం స్వల్ప మార్పులతో ఆరో వేతన సంఘం నివేదికను ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో తీపి కబురు వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

బీజేపీ అధికారంలో !
డీవీ. సదానందగౌడ (బీజేపీ) కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 22 శాతం పెంచారు. అయితే సిద్దరామయ్య సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల ఓటు బ్యాంకు కోసం భారీగా 30 శాతం జీతాలు పెంచాలని ఆలోచిస్తున్నదని తెలిసింది.

బీజేపీ ప్లాన్ !
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆరో వేతన సంఘం ఇచ్చిన నివేదికలో సిద్దూ సర్కారు మార్పులు చేసిన తరువాత స్పంధించాలని బీజేపీ ఆలోచిస్తోంది. లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల ఓటు బ్యాంకు బీజేపీకి దూరం అవుతందని ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications