బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అనూహ్య పరిణామం
Bengalur stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సుమోటోగా ఈ కేసును స్వీకరించింది.
ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 11 మంది దుర్మరణానికి దారి తీసిన ఈ ఘటనలో వైఫల్యం ఎవరిదనే విషయంపై హైకోర్టు విచారణ జరుపనుంది. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2025 కప్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లను కర్ణాటక ప్రభుత్వం సన్మానించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. విధాన సౌధ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి రావాల్సి ఉంది.
వాళ్లను చూడటానికి విధాన సౌధ వద్ద వేల సంఖ్యలో అభిమానులు గుమికూడారు. అక్కడికి వెళ్లలేని లక్షలాదిమంది.. చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఒక్క విధాన సౌధ వద్దే దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు చేరుకున్నారు. కిలోమీటర్ పరిధి వరకు విస్తరించారు.
ఆ తరువాత వారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. 80,000 నుంచి లక్ష మంది వరక ఫ్యాన్స్ విధానసౌధ వద్ద ఆర్సీబీ ప్లేయర్ల కోసం వేచిచూశారు. ఈ సంఖ్య- చిన్నస్వామి స్టేడియం వద్ద రెండింతలుగా కనిపించింది. రెండున్నర నుంచి మూడు లక్షల మంది స్టేడియం వద్ద బారులు తీరారు.
గేట్లను తెరిచిన తరువాత అప్పటివరకు పడిగాపులు పడిన అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ గుంపులుగా స్టేడియం వైపు పరుగులు పెట్టారు. పాస్, టికెట్లను తనిఖీ చేయడానికి గేట్ల వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం పరిస్థితులు తలెత్తినట్లు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
నిజానికి- స్టేడియం సీట్ల సామర్థ్యం 35,000. లక్షలుగా జనం చేరుకోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేనిస్థితికి చేరుకున్నారు. పరిమితికి మించి అభిమానులను స్టేడియం లోనికి అనుమతి ఇస్తే- అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందనే కారణంతో వారిని గేట్ల వద్దే అడ్డుకోవడానికి ప్రయత్నించడం తొక్కిసలాటకు దారి తీసింది.












Click it and Unblock the Notifications