జమ్మూకశ్మీర్ లో ఎన్నికలకు మార్గం సుగమం- రేపు పునర్విభజన కమిషన్ తో పార్టీల భేటీ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తోంది. దీని కోసం పునర్విభజన కమిషన్ సభ్యులు కశ్మీర్ లోని రాజకీయ పార్టీలకు చర్చల కోసం ఆహ్వానం పంపారు.
జమ్ము కశ్మీర్ లో గుప్కర్ అలయన్స్ పేరుతో ఏర్పడిన కూటమిలో భాగస్వాములుగా ఉన్న 14 మంది నేతలతో ప్రధాని మోడీ తాజాగా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జమ్ము కశ్మీర్ ఎన్నికలకు సహకరిస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరణపై పునరాలోచిస్తామని వారికి హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని పార్టీలు కోరుతూ వచ్చాయి, అయితే తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం చర్చలకు రావాలని రాజకీయ పార్టీలకు పునర్విభజన కమిషన్ సభ్యులు ఆహ్వనం పంపారు. దీనికి గుప్కర్ అలయన్స్ భాగస్వాములు అంగీకరించారు.

Recommended Video
జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని జమ్ము కశ్మీర్ పునర్విభజన కమిషన్ పంపిన ఆహ్వానాన్ని రాజకీయ పార్టీలతో పాటు పౌర సంఘాలు కూడా అంగీకరించాయి. రేపు వీరితో కమిషన్ సభ్యులు భేటీ కానున్నారు. అయితే ఇందులో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ మాత్రం ఇంకా తమ నిర్ణయం ప్రకటించలేదు. జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం గతంలో ఉన్న 83 స్ధానాలకు తోడు మరో 7 సీట్లను అదనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేసి మొత్తం 90 సీట్లు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications