నిమ్మరసం, ఐస్ క్రీమ్స్ అమ్ముకున్న చోటే పోలీస్ ఆఫీసర్ గా యానీ శివ .. కేరళలో దగాపడిన ఓ మహిళ స్పూర్తిదాయక కథ !!
సాధించాలనే పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది కేరళలో కుటుంబానికి దూరమై ఒంటరిగా మిగిలిపోయిన ఒక మహిళ .పద్దెనిమిదేళ్ల వయసులోకేరళ రాష్ట్రంలోని వర్కాలలోని పర్యాటకులకు నిమ్మరసం మరియు ఐస్ క్రీం విక్రయించిన మహిళ యానీ శివ. ఎక్కడైతే తను నిమ్మరసం, ఐస్ క్రీమ్ విక్రయిస్తూ జీవనం సాగించిందో ప్రస్తుతం అదే పట్టణానికి పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అందరూ వద్దన్నా ఒంటరిగా కొడుకుతో జీవన పోరాటం చేసిన యానీ శివ
అన్ని వసతులు సమకూర్చినా చదవకుండా పక్కదారి పడుతున్న ఎంతోమంది పిల్లలు ఉన్న నేటి రోజుల్లో, జీవితం ఎన్నో కష్టాలను,బాధలను ఇచ్చినప్పటికీ అన్నిటినీ ఓర్చుకుని కష్టపడి పైకి ఎదిగింది. ఆమె సంకల్పశక్తి , విశ్వాసం,ఆమె సాగించిన పోరాటం ఇప్పుడు కేరళ పోలీసులలో చర్చనీయాంశమైంది. తనను పెళ్లాడిన భర్త , కుటుంబ సభ్యులు తనను కాదని విడిచిపెట్టిన తరువాత, పద్దెనిమిదేళ్ల వయసులో ఆరు నెలల పసిబిడ్డతో రోడ్డు మీద నిలబడిన యానీ శివ నిమ్మరసం, ఐస్ క్రీమ్ విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తూనే, పట్టుదలతో చదువుకుంది.

కేరళ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా విజయం .. మెచ్చుకున్న కేరళ పోలీస్ శాఖ
కేరళ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా విజయం సాధించింది. ఆమె విజయానికి అభినందనలు తెలుపుతూ, కేరళ పోలీసులు ట్వీట్ చేస్తూ, "సంకల్ప శక్తి మరియు విశ్వాసం యొక్క నిజమైన మోడల్ తానే " అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం 31 ఏళ్ల యానీ శివ వర్కాలా పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. ఇక తాను ఎక్కడైతే కష్ట పడిందో, ఎవరి సహాయ సహకారాలు అందని పరిస్థితులలో తన బిడ్డ తో కలిసి కన్నీరు పెట్టుకుందో అక్కడే తనకు ఇన్స్పెక్టర్ గా అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

చదువుకునే రోజుల్లో ప్రేమ పెళ్లి .. బిడ్డ పుట్టాక వదిలేసిన భర్త ,తల్లిదండ్రుల నిరాకరణ
వర్కాల శివగిరి ఆశ్రమంలోని స్టాల్స్‌లో, నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లను అమ్మి జీవనం సాగించాలని అనుకున్నానని, చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మ పొట్ట పోసుకోవాలని ప్రయత్నం చేశానని తన గతాన్ని గుర్తు చేసుకున్న ఆమె తాను పడిన కష్టాలను గుర్తు చేస్తున్నారు. యానీ శివ కంజీరాంకుళంలోని కెఎన్ఎమ్ ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆమె ఒక బిడ్డను కన్న తరువాత, ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు. తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కుటుంబం కూడా ఆమెను అంగీకరించలేదు.

ఆర్నెల్ల కొడుకుతో ఒంటరి ప్రయాణం .. అయినా సరే కేరళ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా
దీంతో ఆరు నెలల తన కొడుకు శివ సూర్యతో జీవన పోరాటాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు కేరళ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా తాను తన కష్టాలను అధిగమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
తమ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్న ఏ స్త్రీ అయినా తన జీవిత కథను ప్రేరేపిస్తే తనకు సంతోషంగా ఉంటుందని యానీ శివ తన కథను సోషల్ మీడియా వేదికగా చెప్పుకున్నారు. అన్ని అసమానతలతో పోరాడుతూ, తాను ఇక్కడకు చేరుకోగలిగానని స్పష్టం చేశారు.

మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత యానీ శివ
ఇతర మహిళలు తమ జీవితంలో ముందుకు సాగడానికి తన నుండి ప్రేరణ వస్తే అదే చాలంటూ ఆమె అన్నారు. సమాజంలో ఎంతో మంది మహిళలు, జీవితంలో దగాపడి, ముందుకు వెళ్లలేమని బాధపడుతున్నారు .కొందరు మోసపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు.కానీ అలా కాకుండా జీవితాన్ని గొప్పగా కూడా మలుచుకోవచ్చని యానీ శివ నిరూపించారు .అలాంటి వారందరికీ యానీ శివ జీవితం ఆదర్శం. కష్టాలనుంచి జీవితానికి ప్రేరణ పొంది ముందుకు సాగిన యానీ శివ మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత.












Click it and Unblock the Notifications