Ayodhya: "సీతమ్మ శాపం వెనక్కితీసుకున్నట్లుంది"-రామాలయంతో అభివృద్ధిపై అయోధ్య రాజు..!
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామమందిరం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఆలయంలో ప్రధాన పనులు పూర్తయిపోయాయి. జనవరి 22న ఆలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. అయితే అంతకు ముందే ఎల్లుండి అయోధ్యలో రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పుతో రామాలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత నగరం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా జనంతో కిటకిటలాడుతోంది. అలాగే నగరంలో కొత్తగా ఎయిర్ పోర్టు, ఆధునీకీకరించిన రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతున్నాయి. వీటితో పాటు నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం అనుమతులు కోరుతూ 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిపై అయోధ్య ఉద్యమంలో పాలుపంచుకున్న రాజవంశీకుడు, అయోధ్య రాజుగా పేరున్న బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా 19వ శతాబ్దంలో రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతున్న రాజు దర్శన్ సింగ్ కు చెందిన అయోధ్య రాజకుటుంబ సభ్యుడు. నగరంలో రాజా సాహెబ్ అని పిలవబడే అతను రామజన్మభూమి ఉద్యమం ప్రారంభించినప్పటి నుండి దానిలో పాల్గొన్నాడు. భూవివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో సభ్యుడు కూడా.
ఈ నేపథ్యంలో బిమ్లేంద్ర తాజాగా అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొందని, తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. సెలవులు, మంగళవారాలు, ఏ పండుగ వచ్చినా నడవడానికి కూడా స్థలం లేదన్నారు. అయోధ్యలో సరైన హోటల్ లేదని, ఇప్పుడు ఐదు నక్షత్రాల హోటళ్లను తెరవడానికి 100కు పైగా దరఖాస్తులు వచ్చాయని జిల్లా మేజిస్ట్రేట్ తనకు చెప్పారన్నారు.
అయోధ్యను కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే కాకుండా నగరాన్ని చూసేందుకు వస్తారని భావిస్తున్నానన్నారు. అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పవిత్రమైన పట్టణంగా పేరు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదంతూ చూస్తుంటే సీతమ్మ తన శాపాన్ని ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అయోధ్యలో స్థానిక పురాణం ప్రకారం రాముడు ఆమెను నగరం నుండి బహిష్కరించినప్పుడు సీత నగరాన్ని శపించిందని, ఆ శాపం కారణంగా నగరం వేగవంతమైన అభివృద్ధికి నోచుకోలేదని చాలామంది నమ్ముతారు.












Click it and Unblock the Notifications