Kisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:
రైతును రాజు అంటాం కానీ.. ఆ రాజు పండించే పంట వెనుక ఎన్నో ప్రాణ సంకటాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలానికి వెళ్లే రైతులను 'పాము కాటు' మృత్యువులా వెంటాడుతోంది. ఏటా వేల సంఖ్యలో రైతన్నలు ప్రాణాలు కోల్పోతున్న ఈ విషాదానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే 'కిసాన్ మిత్ర ఛడీ'.
కిసాన్ మిత్ర ఛడీ పరికరం చూడటానికి మామూలు కర్రలాగే ఉంటుంది. కానీ, ఇది చేసే పని మాత్రం అద్భుతం. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌లో జరిగిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ 'స్మార్ట్ స్టిక్'ను ఆవిష్కరించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' (IoT) 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సాంకేతికతతో పనిచేసే ఈ పరికరం, పొలంలో పాము ఎక్కడున్నా ఇట్టే పసిగట్టేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది? (రక్షణ కవచంలా..)
రైతులు ఈ కర్రను పట్టుకుని పొలానికి వెళ్ళినప్పుడు, దానిపై ఉండే స్పెషల్ బటన్ నొక్కితే చాలు.. సెన్సార్లు అప్రమత్తమవుతాయి. ఇందులో ఉండే 'థర్మల్', 'అల్ట్రాసోనిక్' సెన్సార్లు పాము ఒంటి వేడిని, దాని కదలికల వల్ల వచ్చే కంపనాలను గుర్తిస్తాయి. 5 నుంచి 15 మీటర్ల పరిధిలో పాము ఉంటే, ఈ కర్ర వెంటనే గట్టిగా అదిరిపోతుంది (వైబ్రేట్ అవుతుంది). దీంతో రైతు అప్రమత్తమై ముందుకు వెళ్లకుండా ఆగిపోవచ్చు. గాలికి ఊగే గడ్డికి, పాము కదలికలకు మధ్య తేడాను ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. కాబట్టి తప్పుడు హెచ్చరికలు వచ్చే అవకాశం తక్కువ.
ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది?
రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పరికరాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన మార్కెటింగ్, లభ్యత వివరాలు పరిశీలిస్తే... ఈ స్మార్ట్ స్టిక్ ధర సుమారు రూ.1,500 నుంచి రూ.2,500 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సాధారణ రైతుకు కూడా భారంగా అనిపించకుండా ప్రభుత్వం ధరను నిర్ణయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు 40% నుంచి 50% వరకు సబ్సిడీ ఇచ్చే యోచనలో ఉంది. అంటే రైతులకు ఇది మరింత తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ఇవి ప్రయోగాత్మక దశ పూర్తి చేసుకుని ఉత్పత్తి రంగంలోకి వచ్చాయి.
త్వరలోనే ఇవి స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో (RBKs), ప్రభుత్వ వ్యవసాయ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన పోర్టల్స్ ద్వారా కూడా రైతులు వీటిని బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ-కామర్స్ సైట్లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి) పెద్ద అగ్రి-మాల్స్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.
రైతులకు ఎంతో మేలు!
దేశవ్యాప్తంగా ఏటా సుమారు 60 వేల మంది పాముకాటుతో చనిపోతుంటే, అందులో 80 శాతం మంది రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. రాత్రిపూట నీళ్లు పెట్టడానికి వెళ్లే రైతులకు, కళ్లాల్లో పనిచేసే వారికి ఈ 'కిసాన్ మిత్ర ఛడీ' ఒక నిజమైన మిత్రుడిలా రక్షణ కల్పిస్తుంది.
మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించడం ద్వారా ఈ పరికరం లభ్యత మరియు సబ్సిడీ దరఖాస్తు విధానంపై మరింత స్పష్టమైన సమాచారం పొందవచ్చు.














Click it and Unblock the Notifications