నేడే తొలి ఏకాదశి: వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు
ఇవ్వాళ తొలి ఏకాదశి. హిందువుల తొలి పండగ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పర్వదినం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ఏకాదశి పర్వదినాన్ని ఆచరించడానికి ముస్తాబయ్యాయి. ఈ పండగ సందర్భంగా భక్తులు నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.
తొలి ఏకాదశిని శయనైకాదశి, హరి వాసరం, పేలాల పండగ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనానికి ఉపక్రమిస్తాడు. నాలుగు నెలల శయనిస్తాడు. అక్టోబర్/నవంబర్‌లల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసాలుగా భావిస్తారు.

ఇవ్వాళ్టి నుంచే చాతుర్మాస వ్రతం ఆరంభమౌతుంది. నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షలకు పూనుకుంటారు భక్తులు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, జాగరణ చేయాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. ద్వాదశి రోజున తెల్లవారు జామునే అభ్యంగస్నానం ఆచరించి ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని, వాటిని ఆహారంగా స్వీకరించడం వల్ల వారిని స్మరించుకున్నట్టవుతుంది. అందువల్లే తొలి ఏకాదశి నాడు ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీ.

ఏకాదశి తిథి ఈ తెల్లవారు జామున 3:18 నిమిషాలకు ఆరంభమౌతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2:42 నిమిషాలకు ముగుస్తుంది. ఈ కాలంలో మాంసం, మద్యం జోలికి వెళ్లకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయతో చేసిన ఆహారాన్ని కూడా తినకూడదని శాస్త్రం చెబుతోంది. భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండాలి. జాగారణ చేయాలి. వీలైనంత వరకు నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించాలి.
కాగా- రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి పండగను ఘనంగా జరుపుకోవడానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఏపీ, తెలంగాణల్లోని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications