IRCTC Scam Case: ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్..!!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం,ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది.ఇప్పటికే దాణా కుంభకోణం కేసుల్లో ఇరుక్కున్న రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాలూతో పాటు ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఐఆర్‌సీటీసీ స్కామ్ కేసుతో పాటు లీగల్ న్యూస్ వెబ్‌సైట్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వివిధ క్రిమినల్ నేరాభియోగాలను నమోదు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్ పై అవినీతి, క్రిమినల్ కుట్ర,మోసం వంటి అభియోగాలను కోర్టు నమోదు చేయగా... రబ్రీదేవి తేజస్వీ యాదవ్‌లపై కుట్ర, మోసం సహా పలు సెక్షన్ల కింద నేరాభియోగాలు నమోదైనట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి నేరాభియోగాలను చదివి వినిపించిన అనంతరం, లాలూ యాదవ్ సహా ఇతర నిందితులు తాము నేరం చేయలేదని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణ (Trial) కోరుతున్నట్లు వారు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ దశకు చేరుకుంది.

IRCTC స్కామ్ కేసు ఏంటి..?
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినందుకు ప్రతిగా ఒక ప్రముఖ ప్రాంతంలో భూమిని లంచంగా తీసుకున్నారంటూ సీబీఐ ఆరోపణలు చేసింది.
ప్రధాన ఆరోపణలు ఇవే:
- 2004-2009 మధ్య లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, IRCTC కి చెందిన రాంచీ మరియు పూరీలోని రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ అనే కంపెనీకి టెండర్ ప్రక్రియను తారుమారు చేసి లీజుకు ఇచ్చారు.
- దీనికి ప్రతిఫలంగా, మార్కెట్ విలువలో చాలా తక్కువ ధరకు, కోట్లాది రూపాయల విలువైన భూమిని లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కొడుకు తేజస్వి యాదవ్‌లకు సంబంధించిన కంపెనీకి బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపించింది.
రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు?
లాలూ యాదవ్ కుటుంబం మాత్రం ఈ దర్యాప్తును తీవ్రంగా ప్రశ్నించింది. తమపై ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసు కేవలం రాజకీయ ప్రేరేపితమైనది అని వారు గట్టిగా వాదిస్తున్నారు.ఈ కేసులో లాలూ కుటుంబంతో పాటు, సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కోచ్ఛర్, వినయ్ కోచ్ఛర్, చాణక్య హోటల్ యజమానులు, లారా ప్రాజెక్ట్స్ (పూర్వపు డిలైట్ మార్కెటింగ్ కంపెనీ) మరియు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా భార్య సర్లా గుప్తా వంటి వారి పేర్లను కూడా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.ఇకపై ఈ కేసు విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications