
ప్రకటనలో చెప్పినట్టు కారు మైలేజ్ లేదని ఫోర్డు కంపెనీపై మహిళ వ్యాజ్యం.. 3లక్షల పరిహారం!!
కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ కు కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ షాకిచ్చింది. ఫోర్డ్ కంపెనీ ఫోర్డ్ క్లాసిక్ డీజిల్ కార్ పై ప్రచారం చేసిన యాడ్లో పేర్కొన్న మైలేజీ కంటే 40 శాతం తక్కువ మైలేజీ ఇచ్చిందని ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఫోర్డ్ మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

కారు ప్రకటనకు మైలేజ్ కూ తేడా ఉండటంతో కోర్టును ఆశ్రయించిన మహిళ
ప్రకటనలో చెప్పిన మైలేజీ, వాస్తవ మైలేజీకి పొంతన లేదని, ఫోర్డ్ కార్ కంపెనీపై కోర్టుకెక్కిన మహిళ ఫైనల్ గా విజయం సాధించి సదరు కంపెనీకి షాక్ ఇచ్చింది. కేరళలోని త్రిశూర్ జిల్లాకు చెందిన సౌదామిని 2014వ సంవత్సరంలో 9 లక్షల రూపాయలతో ఫోర్త్ క్లాసికల్ కారును కొనుగోలు చేశారు. ప్రకటన చూసి కారును కొన్నట్టు పేర్కొన్న మహిళ, ప్రకటనల్లో ఇచ్చిన మైలేజ్ కి, తన కారు ఇస్తున్న మైలేజ్ కి వ్యత్యాసం ఉందని గుర్తించారు. దీంతో ఆమె సదరు కారు కంపెనీ పై వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

కోర్టులో ఇరుపక్షాల వాదోపవాదాలు
ప్రకటనలో పేర్కొన్న దాని కంటే కార్ మైలేజీ చాలా తక్కువగా ఉందని, అసలు కార్ మైలేజీ కి, ప్రకటనలో చూపిస్తున్న కార్ మైలేజీకీ పొంతనే లేదని ఆమె కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే దీనిపై ఫోర్డ్ కార్ కంపెనీ డ్రైవింగ్ ను బట్టి, రోడ్ల స్వభావాన్ని బట్టి, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి మైలేజ్ మారుతుందని పేర్కొన్నారు. ఇక తాము ప్రకటనలలో, బ్రోచర్ లలో పేర్కొన్న మైలేజీని థర్డ్ పార్టీ కూడా నిర్ధారించింది అని వారు తెలిపారు. ఇక ఈ కేసును సివిల్ కోర్టుకు రిఫర్ చేయాలని వారు వాదించారు.

మూడు లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల కోర్టు తీర్పు
దీనిపై విచారణ జరిపిన కోర్టు నిపుణులైన కమిషనర్ ను నియమించింది. వాహనానికి సంబంధించి పరీక్షలు నిర్వహించి కమిషనర్ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు చేపట్టింది. సదరు కంపెనీ లీటర్ కు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని బ్రోచర్ లలో, ప్రకటనలలో పేర్కొనగా, అది వాస్తవానికి 19.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్టుగా తేలడంతో బాధితురాలికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సౌదామిని కి మూడు లక్షల రూపాయల పరిహారంతో పాటు గా, కోర్టు ఖర్చులు కింద మరో పదివేల రూపాయలు చెల్లించాలని కోర్టు సదరు కారు కంపెనీని ఆదేశించింది.