అసలే పాత నేరస్థుడు: లాయర్‌ను కాల్చి చంపాడు
చెన్నై: మద్యం మత్తులో ఉన్న పాతనేరస్తుడు తన కేసులు వాదిస్తున్న లాయర్ ను నడి రోడ్డు మీద కాల్చి హత్య చేసిన సంఘటన చెన్నై నగరం సమీపంలో జరిగింది. చెన్నై నగరంలో నివాసం ఉంటున్న న్యాయవాది కామేష్ (34)ఆనే ఆయన హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు.
ఈశ్వర్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. ఇతని మీద అనేక హత్య కేసులు నమోదు అయ్యాయి. ఇతని కేసులను అన్నింటినీ న్యాయవాది కామేష్ వాదిస్తున్నాడు. సోమవారం ఈశ్వర్ అతని లాయర్ కామేష్ ను కలిశాడు. తరువాత ఇద్దరు కలిసి చెన్నైకి 70 కిలో మీటర్ల దూరంలోని మమల్లాపురం వెళ్లారు.
అక్కడే ఒక బార్ లో ఇద్దరు కూర్చుని మద్యం సేవించారు. తరువాత కారులో కామేష్ ఇంటి దగ్గరకు బయలుదేరారు. మార్గం మద్యలో కారులోనే కామేష్, ఈశ్వర్ ల మధ్య మాటా మాట పెరిగింది. ఆ సమయంలో సహనం కొల్పోయిన ఈశ్వర్ తన దగ్గర ఉన్న పిస్టోల్ ను తీసుకుని కామేష్ మీద కాల్పులు జరిపాడు.

కామేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తరువాత ఈశ్వర్ అక్కడి నుండి పరారైనాడు. కామేష్ స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి కారులో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు వచ్చి కామేష్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే న్యాయవాది కామేష్ మరణించాడని వైద్యులు చెప్పారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కామేష్ స్నేహితుల నుండి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. లాయర్ ను హత్య చేసిన హంతకుడు ఈశ్వర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications