Loksabha Speaker: 24 నుంచి పార్లమెంట్, 26న స్పీకర్ ఎన్నిక-టీడీపీ, జేడీయూ పట్టు..!
కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 24 నుంచి జూలై 3 వరకూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనుంది. ఇందులో ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. అనంతరం జూలై 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ నెల 26న జరిగే లోక్ సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్ధులను నిలిపేందుకు ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు స్పీకర్ పోస్టు కేటాయించాలని ఈ రెండు పార్టీలు బీజేపీని కోరుతున్నాయి. కానీ ప్రధాని మోడీ మాత్రం ససేమిరా అంటున్నారు. అయినా ఇంకా టీడీపీ, జేడీయూలో ఆశలు మాత్రం చావలేదు. స్పీకర్ పోస్టు కోసం రెండు పార్టీల నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లోక్ సభ స్పీకర్ పోస్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోవద్దని ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూను విపక్ష ఇండీ కూటమి పార్టీలు కోరుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా బీజేపీకి బదులు ఈ రెండు పార్టీల్లో ఒకరు స్పీకర్ పదవి తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, శివసేన(ఉద్ధవ్) వర్గం ఇదే సూచన చేయగా.. తాజాగా ఆప్ కూడా అదే విషయాన్ని తేల్చిచెప్పేసింది. దీంతో బీజేపీ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.
టీడీపీ, జేడీయూల్లో ఒకరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగానే ఉంది. అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉండటంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ను జేడీయూ వద్దంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications