ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాగుంట శ్రీనివాసులు రెడ్డి: ‘దిల్లీ మద్యం మాఫియా’లో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ పాత్ర ఉందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం చుట్టూ నిత్యం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్య నిషేధం గురించి తాము హామీ ఇవ్వలేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు దిల్లీ రాజకీయాల్లోనూ మారుమోగుతోంది.

దిల్లీ మద్యం విధానంలో కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించారంటూ ఆప్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. అలా ప్రయోజనాలు అందుకున్నట్లుగా చెబుతున్న కంపెనీల్లో ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీ కూడా ఉంది.

పారిశ్రామికవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ మారుతున్నారంటూ సాగిన ప్రచారంపై ఇటీవల వివరణ ఇచ్చారు. తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానంటూ మీడియా సమావేశం పెట్టి చెప్పారు.

దాంతో ఓవైపు దేశ రాజధానిలో వివాదం, మరోవైపు పార్టీ మారుతున్నారని రాష్ట్రంలో ప్రచారం ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అయితే దిల్లీ మద్యం విధానంలో తమకు లబ్ధి జరిగిందనే ప్రచారం వాస్తవం కాదని మాగుంట కుటుంబం చెబుతోంది.

అసలేం జరిగింది...

దిల్లీలో కొన్ని నెలల కిందట కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చింది. 2021 నవంబర్ నుంచి అమలవుతున్న ఈ విధానంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు దిల్లీని 32 జోన్లుగా విభజించారు, ఒక్కో జోన్లో 27 మద్యం దుకాణాలు ఉన్నాయి.

మద్యం విక్రయాల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. మద్యం మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విధానం అమలులోకి తీసుకొచ్చినట్టు దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విధానం అమలు చేయడం ద్వారా గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.

మద్యం రిటైలర్లు ఒకటి కొంటే మరొక బాటిల్ ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.

మనీశ్ సిసోదియా, కేజ్రీవాల్

అక్రమాలు జరిగాయనే ఆరోపణలు..

అయితే, ఎక్సైజ్ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నది బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ.

బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలను టెండర్ ప్రక్రియలో అనుమతించారని దిల్లీలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలు ఆరోపించారు.

"ఖావో గాలి అనే కంపెనీ బ్లాక్ లిస్టులో ఉంది. అయినా టెండర్ ప్రక్రియలో అనుమతించారు. వారికి రెండు జోన్లు కూడా కేటాయించారు. టెండర్లలో సిండికేట్లను అనుమతించకూడదు. కానీ ఖావో గాలి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన కంపెనీతో పాటుగా ఇండో స్పిరిట్ కలిసి సిండికేట్ అయ్యారు. బిడ్లు గెలుచుకున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తం చేతులు మారకుండా ఎలా సాధ్యం. లిక్కర్ లైసెన్సు కోసం డిపాజిట్ చేసిన బిడ్డర్‌కు రూ.30 కోట్లను క్యాబినెట్ ఆమోదం లేకుండా తిరిగి ఇచ్చేశారు. విదేశీ బీర్ తక్కువ ధరకు అందుబాటులో ఉంచే పేరుతో బాటిల్‌కు రూ.50 చొప్పున రాయితీ ఇవ్వడం అనుమానంగా ఉంది’’అంటూ కేంద్ర మంత్రి, దిల్లీ బీజేపీ నేత మీనాక్షి లేఖి మీడియా ముందు ఆరోపించారు.

ఆప్ నాయకుడు, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా లక్ష్యంగా ఈ ఆరోపణలు గుప్పించారు.

మద్యం

సీబీఐ విచారణకు ఆదేశం..

ఈ వివాదం కారణంగా దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 9 నెలల తర్వాత తన మద్యం విధానం వెనక్కి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలకు శ్రీకారం చుడతామని చెప్పింది.

ఆగస్ట్ 1 నుంచి పాత పద్ధతిలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా మద్యం అమ్మకాలు చేపడతామని, దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని మనీశ్ సిసోదియా ప్రకటించారు.

అయితే, మద్యం రిటైల్, హోల్‌సేల్ విక్రేతల లైసెన్సులను మరో నెల రోజులు అంటే ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ దిల్లీ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత.. అంటే సెప్టెంబరు 1 నుంచి పాత విధానం అమల్లోకి వస్తుందని చెప్పింది.

అంతకుముందే కొత్త మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. దిల్లీ పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ చేపట్టింది. దిల్లీ ఎక్సైజ్ అధికారుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది.

దానికి తోడుగా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రంగంలోకి వచ్చారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించారు. దిల్లీ ఎక్సైజ్ విధానం 2021-22 రూపకల్పన, అమలు విషయంలో ఐఏఎస్ అధికారుల పాత్ర గురించి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

దాంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. దిల్లీ ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరికి అనుచిత లబ్ధి చేకూరిందనే విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది తేల్చేందుకు సీబీఐ రంగంలో దిగే అవకాశాలుండడం రాజకీయంగా చర్చనీయమైంది.

మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాత్ర ఏమిటి

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వివిధ కంపెనీలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం దాదాపు 35కిపైగా కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయి. ఆయన సొంతంగా స్థాపించిన కంపెనీలూ ఉన్నాయి.

గతం నుంచి కుటుంబ సభ్యులు నడుపుతున్న కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న అనుభవం ఉంది. వాటిలో మద్యం కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల మద్యం తయారీలో మాగుంట కుటుంబానికి పేరుంది. చెన్నై కేంద్రంగా ఆయన వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి.

శ్రీనివాసుల రెడ్డి వారసుడిగా ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి కూడా ఈ వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామిగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆరు కంపెనీల్లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే దిల్లీ మద్యం టెండర్లలో ఇతరులతో కలిసి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేయడం, అవి ఖరారు కావడంతో దిల్లీ మద్యం విక్రయాల్లో ఒంగోలు ఎంపీ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి.

ఆప్ ప్రభుత్వం సుమారుగా రూ.144 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు, అందులో వైఎస్సార్సీపీ ఎంపీ పేరుని కూడా ప్రస్తావించారు.

పార్టీ మారుతారని ఒంగోలులో చర్చ..

2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగి వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

కానీ ఆ తర్వాత కొద్దికాలానికే టీడీపీలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ 2019 ఎన్నికలకు ముందు మళ్లీ ఆయన వైసీపీలో చేరి ఒంగోలు నుంచి బరిలో దిగి విజయం దక్కించుకున్నారు.

2024 ఎన్నికలకు ముందు ఆయన మరోసారి పార్టీ మారుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. టీడీపీలో గానీ, బీజేపీలో గానీ చేరే అవకాశం ఉందనే కథనాలు వెలువడ్డాయి. వాటిని ఎంపీ శ్రీనివాసులరెడ్డి ఖండించారు. తాను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో దిల్లీ లిక్కర్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు రావడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"మాగుంట అగ్రోఫామ్స్ పేరుతో ఉన్న కంపెనీకి బిడ్డింగ్‌లో టెండర్ దక్కింది. అన్నీ సక్రమంగా జరిగాయి. అవకతవకలు జరిగాయన్నది వాస్తవం కాదు. కంపెనీని అనవసరంగా వివాదంలో లాగారు. ఆరోపణలు నిరాధారం. బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ చేసిన ఆరోపణల గురించి ఆమెకు వివరణ ఇచ్చాను. కంపెనీ వివరాలన్నీ పారదర్శకంగా ఉన్నాయి. దిల్లీ మద్యం విధానంలో నాకు ఎటువంటి సంబంధం లేదు" అని ఆయన మీడియాకు చెప్పారు.

కొన్ని కంపెనీలను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టారనేది తమకు సంబంధం లేని అంశమని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Magunta Srinivasulu Reddy: Does Ongole YSRCP MP have role in 'Delhi Liquor Mafia'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X