కొవిడ్ వ్యాధికి పండ్ల వ్యాపారి వైద్యం -ఏకంగా క్లినిక్ పెట్టేసి డాక్టర్‌గా భారీ బిల్డప్ -అరెస్టు చేసిన పోలీసులు
ఒకడు గోమూత్రం తాగమంటాడు.. ఇంకొకడు పసుపును గోరుముద్దలుగా తినాలంటాడు.. వాట్సాప్ యూనివర్సిటీలోనైతే ప్రిస్క్రిప్షన్లకు అంతే ఉండదు.. కరోనా విలయకాలంలో జనం భయాలను ఆసరసాగా తీసుకుని తప్పుడు సలహాలిచ్చే మేతావులు, ప్రజల ఆందోళనను క్యాష్ చేసుకునే నకిలీరాయుళ్లు పెరుగుతున్నారు. కోవిడ్-19 మహమ్మారిని కొందరు స్వార్థపరులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది..
వైద్య రంగంలో ఎటువంటి ప్రవేశం లేనివారు సైతం కోవిడ్‌కు మందులు ఇస్తామంటూ ప్రజలను దోచుకుంటోన్న మరో ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది. చేసేది పండ్ల వ్యాపారమే అయినా చిన్న చిన్న చిట్కాలతో మొదలై ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తేసి కొవిడ్ రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఘనుడు. పండ్లు అమ్ముకునే ఆ వ్యక్తి వైద్యుడిగా అవతారమెత్తి కోవిడ్-19 వ్యాధిగస్థులను మోసం చేస్తున్నందుకు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌లోని కమఠి ప్రాంతంలో నివసిస్తున్న చందన్ నరేశ్ చౌదరి ఓ సాధారణ వ్యాపారి. పండ్లు, ఐస్ క్రీమ్ అమ్ముకునేవారు. ఎలక్ట్రీషియన్‌గా కూడా పని చేస్తూంటాడు. సామాజిక సేవా దృక్ఫథంతో ఐదేళ్లుగా 'ఓం నారాయణ మల్టీపర్పస్ సొసైటీ' పేరుతో ఓ చారిటబుల్ డిస్పెన్సరీని నడుపుతున్నారు. అక్కడికి వచ్చే రోగులకు ఆయుర్వేదం మందులు ఇస్తూండేవాడు. అలా..
ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితిని ఆసరాగా తీసుకుని, చందన్ నరేశ్ చౌదరి తన డిస్పెన్సరీలో కొవిడ్ రోగులకు చికిత్స ఇవ్వడం మొదలుపెట్టాడు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సిరంజిలు, ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్ తో చిన్నపాటి ఆస్పత్రిని నడిపిస్తున్నారు. ఈ ఉదంతంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు డిస్పెన్సరీని తనిఖీ చేయగా గుట్టు బయటపడింది. మహారాష్ట్ర ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారం పండ్ల వ్యాపారి చౌదరిని అరెస్టు చేశారు. కొవిడ్ వ్యాధికి సొంత వైద్యం, ఇంటి చిట్కాలు కూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications