కారు కొనాలంటే పార్కింగ్ స్థలం ఉండాల్సిందే-ఆ రాష్ట్రంలో షాకింగ్ రూల్..!
దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న వాహనాల రద్దీతో పార్కింగ్ స్థలాలు మాయమవుతున్నాయి. ఉన్న కాస్త స్థలాల్లో పార్కింగ్ చేసే అవకాశం లేకపోవడంతో రూడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపేయడం సర్వసాధారణమవుతోంది. మెట్రో నగరాల్లో ఈ పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో చేసేది లేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో వాహనాల రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. త్వరలోనే ఈ నిబంధన అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే కార్లు కొనేవారు తమకు పార్కింగ్ స్థలం ఉన్నట్టు సంబంధిత పత్రాలను అందిస్తేనే దాన్ని కొనేందుకు వీలు ఉంటుంది.

తమకు సొంత పార్కింగ్ స్థలం ఉన్నట్లు చూపించడంలో విఫలమైతే మాత్రం కారు కొనేందుకు అవకాశం ఉండదు. దీంతో మహారాష్ట్రలో మధ్యతరగతి ప్రజలకు భారీ షాక్ తప్పేలా లేదు. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. పలు అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న వారికి తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాళ్లు కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారని, దీనివల్ల పార్కింగ్ సమస్య ఎక్కువవుతోందన్నారు. అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందన్నారు. అందుకే పార్కింగ్ ఉన్నవారికే కార్లను విక్రయించాలనే నిబంధనను తీసుకొస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications