భారీ ఎన్‌కౌంటర్: మావోయిస్ట్ అగ్రనేత సహా నలుగురు హతం
బీహార్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఒడిశా అడవుల్లో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కోటి రూపాయలకు పైగా రివార్డు ఉన్న కీలక మావోయిస్టు నేత గణేష్ ఉయికే సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఒడిశాలోని కంధమాల్-గంజాం జిల్లాల సరిహద్దుల్లోని రంప అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే(69) హతమయ్యారు.
గురువారం ఉదయం రంభ అటవీ శ్రేణిలో 9గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో గణేష్ ఉయికేతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు (వీరిలో ఇద్దరు మహిళా కేడర్లు) మరణించారు. ఘటనా స్థలం నుండి రెండు ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, ఒక .303 రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఎవరీ గణేష్ ఉయికే?
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ ఉయికే అసలు పేరు పక్కా హనుమంతు. రాజేష్ తివారీ, రూప అనే మారుపేర్లతో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రభుత్వం ఈయనపై రూ. 1.1 కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. గణేష్ మావోయిస్టు పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం 'కేంద్ర కమిటీ'లో సభ్యుడిగా ఉన్నారు. దాదాపు 40 ఏళ్లుగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)లో కీలక పాత్ర పోషించారు. తూర్పు కనుమల్లో మావోయిస్టు ఉద్యమ విస్తరణకు ఈయనే ప్రధాన సూత్రధారిగా భావిస్తారు.
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికే జనరల్ సెక్రటరీ బసవరాజ్ (మే నెలలో), కమాండర్ మాడ్వి హిడ్మా (నవంబర్‌లో) మరణించడంతో పార్టీ నాయకత్వం తీవ్రంగా బలహీనపడింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో గణేష్ ఉయికే మరణం తర్వాత కేవలం ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌తో ఒడిశాలో మావోయిస్టుల వెన్నెముక విరిగిందని భద్రతా దళాల ఉన్నతాధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications