మీకు చేతకాకపోతే రంగంలోకి సీబీఐ-సొంత పోలీసులకు మమత వార్నింగ్..!
పశ్చిమబెంగాల్లో ఓ ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురికావడంతో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె కూడా దీన్ని అంతే సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసులకు ఆమె తాజాగా ఓ ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. వారం రోజుల్లో ఈ కేసు తేల్చకపోతే సీబీఐకి అప్పగిస్తానని మమత తేల్చిచెప్పేశారు. దీంతో వారికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
కోల్ కతాలోని ఆర్ జే కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..
సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఆమె నివాసాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం నాటికి పోలీసులు కేసును ఛేదించలేకపోతే దీని దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించారు.
ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. వాస్తవానికి సీబీఐకి దీన్ని మార్చే సమస్య లేదని, దాని సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ సీబీఐ పరిష్కరించలేని కొన్ని హైప్రొఫైల్ కేసుల్ని ఆమె ప్రస్తావించారు.

గత శుక్రవారం ఉదయం ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో అత్యాచారం, హత్యకు గురైన మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహం లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి ఓ పౌర వాలంటీర్‌ను శనివారం అరెస్టు చేశారు. మరణించిన యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఆస్పత్రిలో లోపల వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన మమత.. బాధితురాలి స్నేహితులు, ఇతరుల్నీ ప్రశ్నించాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేయగా.. సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్ ను ప్రభుత్వం తొలగించింది.












Click it and Unblock the Notifications