పాక్ పాక్ పడవ పేలుడుపై దుమారం: విచారణకు పరికర్ ఆదేశం
న్యూఢిల్లీ: నిరుడు డిసెంబర్ 31న అరేబియా సముద్రంలో పేలిపోయిన పాకిస్థాన్ పడవ ఘటనపై తాజాగా దుమారం రేగింది. పాకిస్థాన్ పడవను తామే పేల్చేసినట్లు కోస్ట్‌గార్డ్ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వ్యాఖ్యానించడంతో అసలు ఆ రోజు ఏంజరిగిందన్న విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కోస్ట్‌గార్డ్ అధికారి చెప్తున్నారు.
కరాచీ నుంచి పేలుడు పదార్థాలతో వస్తున్నట్లు భావించిన పాకిస్థాన్ పడవ పోరుబందర్‌కు 365కిలోమీటర్ల దూరంలో ఉండగా భారత తీర రక్షణ దళం (కోస్ట్‌గార్డ్) గుర్తించినట్లు, దీంతో వెంటనే పడవలోని వ్యక్తులే దాన్ని పేల్చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారంనాడు అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన కోస్ట్‌గార్డ్ డీఐజీ బీకే లోషాలి వీడియో ఒకటి బయటికి వచ్చింది.
"డిసెంబర్ 31వ తేదీ రాత్రి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను గాంధీనగర్‌లో ఉన్నాను. పాకిస్థాన్ పడవ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే.. దాన్ని పేల్చేయాలని ఆదేశించాను. వారిని పిలిచి బిర్యానీ పెట్టాలని మేం భావించలేదు" అని లోషాలి వ్యాఖ్యానించినట్లుగా ఆ వీడియోలో ఉన్నది. ఇది బహిర్గతం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ వెంటనే స్పందించింది.

ఆ రోజు ఘటనపై రక్షణమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. పాకిస్థాన్ పడవను పేలడంలో రక్షణశాఖ నేరమేమైనా ఉందా.. లేక ప్రజలకు అబద్ధం చెప్తున్నారా? ఒకవేళ అది ఉగ్రవాదుల పడవే అయితే దాన్ని పేల్చివేసిన విషయాన్ని వెల్లడించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ బుధవారం స్పందించారు. పాకిస్థాన్ పడవ దానికదే పేలిపోయి సముద్రంలో మునిగిపోయిన విషయంపై గతంలో రక్షణశాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని, తాము దానికే కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. పడవను తామే పేల్చివేశామంటూ కోస్ట్‌గార్డ్ డీఐజీ లోషాలి నిజంగానే వ్యాఖ్యానించి ఉంటే విచారణ జరిపిన తరువాత చర్య తీసుకుంటామని అన్నారు. అవసరమైతే డిఐజి లోషాలిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
పాకిస్థాన్ పడవ వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆ ఘటనను ప్రజా సంబంధ కార్యక్రమంగా భావిస్తున్నదని పేర్కొంది. ఒక చెయ్యి ఏ పనిచేస్తున్నదో మరో చెయ్యికి తెలియనట్లుగా ప్రభుత్వం తీరు ఉన్నదని, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో దీన్నిబట్టే అర్థమవుతున్నదని ఆప్ సీనియర్ నాయకుడు అశుతోశ్ రాణా అన్నారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: లోషాలి
పాకిస్థాన్ పడవను తామే పేల్చామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కోస్ట్‌గార్డ్ డీఐజీ లోషాలి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. నా వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని, ఎటువంటి దేశ విద్రోహ శక్తులనూ తీర భద్రతను దాటనివ్వబోమని, వారిని ఆహ్వానించి బిర్యానీ పెట్టబోమని మాత్రమే తాను అన్నానని లోషాలి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications