పాకిస్థాన్ కు భారత్ సంచలన హెచ్చరిక
పాకిస్థాన్ కు చెందిన నేతలు, అధికారులు పదే పదే భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. సింధూ నదిపై డ్యామ్ లు నిర్మిస్తే 10 మిసైల్లతో కూల్చేస్తామంటూ ఇటీవల అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాకిస్థాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రణధీర్ జైస్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ దేశ నేతలు, అధికారులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భారత్ పై విమర్శలు చేయడం పాకిస్థాన్ కు అలవాటేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి విష ప్రచారాలు, విద్వేష పూరితమైన ప్రసంగాలు పాకిస్థాన్ ఆపాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. లేదంటే భవిష్యత్తులో బాధాకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలపై రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా భాగస్వామ్యం అనేక సవాళ్లను తట్టుకుని నిలబడిందన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం కీలకమైనదిగా పేర్కొన్నారు. ఇక ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ నది నుంచి తమకు రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా భారత్ కు వదులుకోం అని తెలిపారు. తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే యుద్ధానికి సంకేతంగా తాము భావిస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాల్గొని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు నీరు రాకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూసి పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications