కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ప్రభుత్వం ఉచిత వైద్యం అందించదు: తేల్చేసిన సీఎం విజయన్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో.. వారు కరోనా బారినపడితే వారికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించదని.. వారి బిల్లులు వారే చెల్లించుకోవాలని స్పష్టం చేశారు.
'వ్యాక్సిన్ తీసుకోకుండానే కోవిడ్-19 పాజిటివ్‌గా మారిన వారి చికిత్స ఖర్చు ప్రభుత్వం భరించదు' అని విజయన్ తేల్చి చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి లేదా అలెర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు అదే విషయాన్ని పేర్కొంటూ ప్రభుత్వ వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

'అలెర్జీ లేదా ఆరోగ్య సమస్యల కారణంగా టీకాలు వేసుకోలేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల నగదును వ్యక్తులే భరించాలి' అని సీఎం స్పష్టం చేశారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కార్యాలయాల్లో పనిచేసే వారికి, ప్రజలతో మమేకమయ్యే వారికి ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం నేపథ్యంలో జాగ్రత్తలు పటిష్టం చేయాలని విజయన్ అధికారులను ఆదేశించారు.
విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సీఎం అన్నారు. డిసెంబర్ 1 నుండి 15 వరకు కేరళలో ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించబడుతుంది. పాఠశాల సమయాలు అలాగే ఉంటాయి, వికలాంగ పిల్లలను పాఠశాలలకు రావడానికి అనుమతి ఇవ్వబడుతుందని తెలిపారు.
Recommended Video
కోవిడ్-19 సంసిద్ధతను తనిఖీ చేయడానికి జరిగిన సమీక్షా సమావేశంలో, కొత్త కోవిడ్-19 వేరియంట్ వల్ల కలిగే భయం కారణంగా మరిన్ని సడలింపులు ఇవ్వకూడదని నిర్ణయించామని కేరళ ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications